పట్టాదారు పాస్​బుక్ లో తప్పులెప్పుడు సరిచేస్తరు

పట్టాదారు పాస్​బుక్ లో తప్పులెప్పుడు సరిచేస్తరు

తప్పులు సరిచేయకపోతే రైతులు హక్కులు కోల్పోయే ప్రమాదం ఉంది

ప్రభుత్వ భూములను దున్నుతున్న రైతులకూ హక్కులివ్వాలి

టీజేఎస్​, లెఫ్ట్​ పార్టీలు, ప్రజాసంఘాల నేతలు

హైదరాబాద్, వెలుగురాష్ట్రంలోని చాలా మంది రైతుల పట్టాదారు పాస్​ పుస్తకాల్లో సర్వే నంబర్లు, పేరు, విస్తీర్ణంలో తప్పులు దొర్లాయని, వాటిని సరిచేయకపోతే రైతులు, ప్రత్యేకించి పేద రైతులు భూమిపై హక్కు కోల్పోయే ప్రమాదం ఉందని టీజేఎస్​, లెఫ్ట్​ పార్టీలు, ప్రజాసంఘాల నేతలు అభిప్రాయపడ్డారు. ఈ లోపాలను సరి చేయడానికి కొత్త రెవెన్యూ బిల్లులో ఎలాంటి చర్యలను ప్రతిపాదించ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. శాసనసభ శుక్రవారం ఆమోదించిన కొత్త రెవెన్యూ చట్టంపై టీజేఎస్​ అధ్యక్షుడు ప్రొఫెసర్​​కోదండరాం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట రెడ్డి, టీటీడీపీ నేతలు ఎల్​. రమణ, రావుల చంద్రశేఖర రెడ్డి, సీపీఎం నేతలు డీజీ నర్సింహారావు, సారంపల్లి మల్లారెడ్డి, న్యూడెమోక్రసీ నేత పోటు రంగారావు శనివారం ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. కొత్త రెవెన్యూ చట్టం సమస్యలన్నింటికీ పరిష్కారం చూపడం లేదని, కేవలం రిజిస్ట్రేషన్​, పట్టాదారు పాస్​ పుస్తకం జారీ వంటి అంశాలకే పరిమితమైందని పేర్కొన్నారు. కొనుగోళ్లు, అమ్మకాలను వేగవంతం చేయడమే బిల్లులో కనిపిస్తోందని, అవినీతి నిర్మూలన మూలన పడిందని ఆరోపించారు. ధరణి వెబ్​సైట్​లో సమస్యలు లేవన్న ప్రాతిపదికన బిల్లు రూపొందించారని, కానీ భూ రికార్డుల్లో అనేక తప్పులున్నాయని అన్నారు.

అనుభవదారుల కాలమ్​ లేకపోవడం నష్టమే

సాదాబైనామా కలిగిన సుమారు 11 లక్షల మంది రైతుల హక్కుల క్రమబద్ధీకరణకు ఎలాంటి పరిష్కారాన్నీ బిల్లులో చూపలేదని నేతలు విమర్శించారు. అటవీ హక్కుల చట్టం ప్రకారం ఆదివాసీలకు ఉన్న పట్టాలు రెవెన్యూ రికార్డుల్లో నమోదు కాలేదని, వారి హక్కులను రెవెన్యూ చట్టం పరిరక్షించాలని డిమాండ్​ చేశారు. ప్రభుత్వ భూములను ఎన్నో ఏళ్లుగా దున్నుకుంటున్న రైతులకు భూమిపై చట్టబద్ధమైన హక్కు కల్పించాలని కోరారు. గతంలో ఇలాంటి రైతుల పేర్లను అనుభవదారుల కాలమ్​లో నమోదు చేసి కొంత రక్షణ కల్పించారని, ఇప్పుడు ఆ కాలమ్​ తొలగించడం వల్ల రక్షణ పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బిల్లు పట్టణాల చుట్టూ భూములు కొని అమ్మేవారికి ఉపయోగపడుతుందే తప్ప పేద రైతులు, ఆదివాసీలు, దళిత రైతుల హక్కుల రక్షణకు తోడ్పడదన్నారు. కౌలు రైతులకు భూమిపై హక్కు కల్పించకపోయినా వ్యవసాయ సంబంధిత ప్రభుత్వ పథకాలు దక్కేలా చూడాలని, లేదంటే లాభసాటి వ్యవసాయం, కోటి ఎకరాల తెలంగాణ కేవలం నినాదాలుగా మిగిలిపోతాయని అన్నారు. రెవెన్యూ బిల్లుపై సమగ్ర చర్చ జరగాలని నేతలు కోరారు.