
సెప్టెంబట్ 30 నుంచి ప్రారంభం కానున్న ఐసీసీ విమెన్స్ వరల్డ్ కప్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మరో నెల రోజుల్లో స్టార్ట్ కానున్న ఈ మెగా టోర్నీకి ఇండియా, శ్రీలంక సంయక్తంగా ఆతిధ్యమిస్తున్నాయి. సొంతగడ్డపై వరల్డ్ కప్ జరగనుండడంతో భారత మహిళల జట్టు టైటిల్ ఫేవరేట్ గా బరిలోకి దిగనుంది. ఒక్కసారి కూడా వన్డే వరల్డ్ కప్ గెలవని భారత జట్టుకు ప్రపంచ ఛాంపియన్లుగా అవతరించడానికి ఇదే అద్భుత అవకాశం. హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్సీలోని మన జట్టు ఈ సారి పటిష్టంగా కనిపిస్తోంది.
ఇదిలా ఉంటే.. వరల్డ్ కప్ 2025 పై భారత మాజీ దిగ్గజం మిథాలీ రాజ్ ఫైనల్ కు వెళ్లే జట్లేవో తన అభిప్రాయాన్ని చెప్పింది. స్పోర్ట్స్ కంటెంట్ హెడ్ కె. శ్రీనివాస రావుతో జరిగిన ఇంటర్వ్యూలో మిథాలీ మాట్లాడుతూ.. "వన్డే ఫార్మాట్లో భారత జట్టు చక్కగా రాణిస్తున్నారు. ఆస్ట్రేలియా ఇప్పటికీ కఠినమైన ప్రత్యర్థిగా ఉంది. వరల్డ్ కప్ కు ముందు బీసీసీఐ ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ నిర్వహించడం ఖచ్చితంగా టీమిండియాకు మంచి అవకాశం. ఫైనల్లో ఇండియా, ఆస్ట్రేలియా ఆడతాయని అనుకుంటున్నాను". అని మిథాలీ రాజ్ తెలిపింది.
సొంతగడ్డపై జరగనున్న ప్రపంచ కప్ భారత జట్టుకు తమ తొలి టైటిల్‌ను గెలుచుకోవడానికి ఒక గొప్ప అవకాశాన్ని అందిస్తుందని మిథాలీ నమ్ముతుంది. 2005, 2017లో రెండు సార్లు ఇండియాను ఫైనల్ కు చేర్చిన మిథాలీ టైటిల్ అందించలేకపోయింది. ఈ సారి టీమిండియాకు ప్రధాన ప్రత్యర్థి ఆస్ట్రేలియా అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 7 సార్లు వన్డే వరల్డ్ కప్ గెలిచిన ఆస్ట్రేలియా మరోసారి హాట్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది. వరల్డ్ కప్ కు ముందు భారత జట్టు ఆస్ట్రేలియాతో మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ ఆడనుంది.
►ALSO READ | కొత్త జర్నీ కోసం వెయిట్ చేస్తున్నా: ఐపీఎల్‌కు స్టార్ స్పిన్నర్ అశ్విన్ గుడ్ బై
మొత్తం ఎనిమిది జట్లు పాల్గొనే ఈ టోర్నీ 2025, సెప్టెంబర్ 30 నుంచి 2025 నవంబర్ 2 వరకు భారత్, శ్రీలంకలోని ఐదు వేదికలలో హైబ్రిడ్ మోడ్‌లో జరగనున్నట్లు ఐసీసీ వెల్లడించింది. భారత్‌లోని ముంబై, గౌహతి, ఇండోర్, విశాఖపట్నం స్టేడియాల్లో మ్యాచులు జరగనున్నాయి. పాకిస్తాన్ తమ మ్యాచ్‌లను శ్రీలంక కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో ఆడనుంది. భద్రతా కారణాల దృష్ట్యా పాక్ వెళ్లేందుకు భారత జట్టు నిరాకరించింది. దీంతో టోర్నీని హైబ్రిడ్ మోడ్‌లో నిర్వహించి.. భారత్ ఆడే మ్యాచులను దుబాయ్ వేదికగా నిర్వహించారు.
ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్ .. ఈ జట్లు వరల్డ్ కప్ కోసం పోటీ పడనున్నాయి. ఆస్ట్రేలియా డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతోంది. సొంత దేశంలో టోర్నీ కావడంతో భారత్ హాట్ ఫేవరెట్. భారత్ చివరగా 2013లో ప్రపంచ్ కప్‌కు ఆతిథ్యం ఇవ్వగా.. ఈ టోర్నీలో ఇండియా ఉమెన్స్ టీమ్ గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. 2017లో లార్డ్స్‌లో జరిగిన ఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోవడంతో వన్డే వరల్డ్ కప్ భారత మహిళలకు కలగానే మిగిలింది. ఈ సారి టోర్నీ భారత్‌లోనే జరుగుతుండటంతో హర్మన్‌ప్రీత్ కౌర్ సేన టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది.