రాష్ట్ర లీడర్లు ప్రచారం చేసిన చోట డిఫరెంట్ రిసల్ట్

రాష్ట్ర లీడర్లు ప్రచారం చేసిన చోట డిఫరెంట్ రిసల్ట్

హైదరాబాద్, వెలుగు: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ నేతలు ప్రచారం చేసిన ప్రాంతాల్లో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. అక్కడ తెలుగు ఓటర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో బీజేపీ, కాంగ్రెస్ అగ్ర నేతలు ప్రచారం చేశారు. ఆయా ప్రాంతాల్లో కొందరు అభ్యర్థులు విజయం సాధించగా, మరికొందరు ఓడిపోయారు. బీజేపీ తరఫున కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, పార్టీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డీకే అరుణ, తెలంగాణ చీఫ్ సంజయ్, ఎంపీ అర్వింద్, మాజీ ఎంపీలు వివేక్ వెంకటస్వామి, జితేందర్ రెడ్డి, నేతలు పొంగులేటి సుధాకర్ రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, బండ కార్తీకరెడ్డి ప్రచారం చేశారు. బళ్లారి సిటీలో డీకే అరుణ, జితేందర్ రెడ్డి బీజేపీ అభ్యర్థి సోమశేఖర్ రెడ్డికి మద్దతుగా ప్రచారం చేయగా, అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందారు.

పొంగులేటి సుధాకర్ రెడ్డి పావగడ నియోజకవర్గంలో ప్రచారం చేయగా అక్కడ కాంగ్రెస్ గెలిచింది. ఇక కాంగ్రెస్ నుంచి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, వంశీచంద్ రెడ్డి, సంపత్ కుమార్, మధుయాష్కీ గౌడ్, శ్రీధర్ బాబు ప్రచారం నిర్వహించారు. రేవంత్ బీదర్, భాల్కి, బసవకల్యాణ, హుమ్నాబాద్, అలంద్, చించోలి, సెడం నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు. బీదర్, భాల్కి, అలంద్, సెడంలో కాంగ్రెస్ గెలవగా.. హుమ్నాబాద్, చించోలి, బసవకల్యాణలో బీజేపీ గెలిచింది.

కుష్టగిలో బీజేపీ విజయం..

బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్​ వెంకటస్వామి ప్రచార బాధ్యతలు చేపట్టిన కుష్టగి సీటును బీజేపీ గెలుచుకుంది. అక్కడ పోటీ చేసిన పార్టీ అభ్యర్థి దొడ్డన గౌడ హనుమగౌడ పాటిల్ 9,610 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఈ నియోజకవర్గానికి వివేక్ వెంకటస్వామి ఇన్ చార్జ్ గా వ్యవహరించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలో నెల రోజుల పాటు మకాం వేశారు. నియోజకవర్గమంతా తిరిగి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు, అడ్వొకేట్లు బీజేపీలో చేరారు.