మన సమాజం అనాదిగా తల్లిదండ్రులనే ప్రత్యక్ష దైవాలుగా కొలుస్తూ వస్తున్న వ్యవస్థను నిర్మించింది. అమ్మను మించిన దైవం, తండ్రిని మించిన గురువు లేడు. జీవిత పరమార్థం వారికి సేవ చేయడమే. గత రెండు దశాబ్దాలుగా సమాజ పరిస్థితులో, ఆర్థిక అవసరాలో పేరేదైనా ఉమ్మడి కుటుంబాలస్థానే కేంద్రక కుటుంబాలు వచ్చాయి. ఇక నేడు వయోజనుడై ఉద్యోగంలో చేరే 25 ఏళ్ల వయసు వచ్చినవారి కుటుంబాల్లో చాలాశాతం ఒక్కరే సంతానంగా ఉన్నవారే. నాటి జనాభా నియంత్రణ ప్రచారమో లేక ఆర్థికంగా ఉన్న పరిమితులో కారణాలేవైతేనేం, కొడుకైనా, కూతురైనా ఒక్కరే చాలు అనుకొని.. ఆ ఒక్కరికే అన్ని అవసరాలు తీర్చేలా పెంచాలనే తాపత్రయంలో జీవితాల్ని ధారపోసినవారే సమాజంలో కనిపిస్తున్నారు.
కొంతకాలంగా పిల్లల్ని గొప్పగా చదివించాలని ఊరును వదిలేసి టౌన్లు, పట్టణాలు, నగరాలకు సగం జనాభా వలసలు వెళ్లి స్థిరపడింది. ఇలా జీవనం గడిపే క్రమంలోనే ఒకనాడు తల్లిదండ్రులనే దైవాలుగా భావించిన స్థానంలో, బాధ్యతగా భావించే విధానం అలవడింది. అలా నెలకోసారి లేదా పండుగలప్పుడో ఊరుకువెళ్లి పెద్దల్ని చూసి వచ్చేవారు. ఈ క్రమంలో నాడు చిన్నారులుగా ఉన్న నేటి యువత.. అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యల ఆప్యాయతలకు దూరమయ్యారు.
ఉద్యోగ, వ్యాపార రీత్యా తల్లిదండ్రులను చూసుకోలేకపోతున్నావారో, లేదా ఇతర కారణాల వల్లనో.. గత 20 ఏళ్లుగా వృద్ధాశ్రమాల్లో పెద్దల్ని చేర్చడం బాగా పెరిగిపోతున్నది కూడా. అలా పెద్దలకు గౌరవం ఇవ్వడం సంగతేమో కానీ వాళ్లను చూసుకోవాల్సిన కనీస బాధ్యత సైతం మనపై లేదనుకునేవారి సంఖ్య పెరుగుతున్నదని నివేదికలు చెపుతున్నాయి. ఇది చాపకింద నీరులా గత రెండు దశాబ్దాలుగా రాష్ట్రంలో, దేశంలో ఆ మాటకొస్తే ప్రపంచంలో పెరిగిపోయిందనేది అక్షర సత్యం.
సమాజాన్ని అస్తవ్యస్తం చేసే స్థితి
ఇప్పటికే ఎన్నో కుటుంబాల్లో గౌరవప్రదంగా సాగనంపాల్సిన అంత్యక్రియలు మహా విషాదంగా మారి, శవాన్ని ముందే పెట్టుకొని వాటాల పంచాయితీలు తేల్చేదాకా వెళుతున్నాయి. పోలీస్ స్టేషన్లు, కోర్టుల వరకూ చేరుకుంటున్నాయి. ఈ విషాదం ఒకటైతే ఇక అనాగరికంగా అనైతిక బంధాలతో, అక్రమ సంబంధాలతో భార్యను, పిల్లల్ని, భర్తను, అతని బంధువుల్ని సైతం అత్యంత కిరాతకంగా చంపుతున్న కథనాలు ఈరోజు పత్రికల్లో విరివిగా వస్తున్నాయి. ఇది మానసిక సమస్యల్నే కాదు మొత్తం సమాజాన్నే అశాంతిలోకి నెట్టి అస్తవ్యస్తం చేసే స్థితికి మెల్లగా చేరుకుంటున్నాయి.
ప్రభుత్వాలు సామాజిక సమస్యలను గుర్తించాల్సిన సమయమిది. తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఈ సమస్యపై సైతం ఎవరూ అడగకుండానే బాధ్యతగా వ్యవహరిస్తోంది. చట్టసభల బాధ్యతలను గుర్తుచేస్తూ యావత్ భారతదేశానికి దిక్సూచిలా ఎంప్లాయీస్ అకౌంటబులిటీ అండ్ మానిటరింగ్ ఆఫ్ పేరెంటల్ సపోర్ట్ బిల్‌ను శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రవేశపెడ్తూ దీని ఆవశ్యకతను వివరించిన తీరు అందర్నీ ఆకట్టుకుంది.
వయోవృద్ధులకు అండగా చట్టం..
సీఎం రేవంత్ రెడ్డి ఈ బిల్లును సభకు పరిచయం చేస్తూ ‘నీడ్ ఆఫ్ ద హవర్’గా తెస్తున్నందుకు సంతోషపడుతున్నప్పటికీ, అనుబంధాలను చట్టం చేసి గుర్తు చేయాల్సి రావాల్సిన పరిస్థితుల్ని భావోద్వేగంగా వివరిస్తుంటే చూసిన ప్రతీ ఒక్కరి కళ్లు చెమ్మగిల్లాయి. ఆయన పురాణాల్లోని మాతృ, పితృభక్తికి మారుపేరుగా నిలిచిన శ్రవణ కుమారుడి కథని చెబుతూ.. ‘తల్లిదండ్రులను ప్రేమించడంలో శ్రవణ కుమారుడిని ఆదర్శంగా తీసుకుంటే ఎలాంటి చట్టాలు, ఎలాంటి నిబంధనలు అవసరం లేదని వివరించారు.
అదేసమయంలో ఈ మధ్యే మరణించిన ప్రఖ్యాత దుస్తుల బ్రాండ్ రేమండ్స్ మాజీ అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త, పద్మభూషణ్ అవార్డు గ్రహీత విజయ్ పథ్ సింఘానియా ఆత్మకథ 'An Incomplete Life'లో ఈ చేదు అనుభవాలని, అతని కొడుకు చేసిన ద్రోహం గురించి వివరిస్తుంటే మనుషులు ఇంత బండరాయిలా మారారా అనే ఆవేదన మనలో రగిలించారు. నేటి సమాజంలోని తల్లిదండ్రుల పట్ల భక్తి లేని వారికి భయం కలిగించేందుకే ఈ చట్టం అని.. జీవితం చివరి మజిలీలోని పండుటాకులకు కొండంత ధైర్యం కలిగించారు సీఎం రేవంత్ రెడ్డి.
చట్టపర భద్రత
మన దేశంలో పిల్లల సామాజిక భద్రత, మహిళల భద్రత, హక్కులకు చట్టం ఉంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 (ఏ) ప్రకారం 6 నుంచి 14 ఏళ్ల పిల్లలకు ఉచిత విద్యాహక్కు ఉంది. ఆర్టికల్ 24 ప్రకారం ప్రమాదకర పనుల్లో బాల కార్మికుల నిషేధం ఉంది. అనాథలు, నిరాశ్రయ పిల్లలు, నేరాల్లో చిక్కుకున్న పిల్లల సంరక్షణ కోసం జువెనైల్ జస్టిస్ యాక్ట్ (2015) ఉంది. పిల్లలపై లైంగిక దాడులు, వేధింపుల నుంచి రక్షణ కోసం పోక్సో యాక్ట్ (2012) ఉంది.
రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ (2009) ఉంది. 14 ఏళ్లలోపు పిల్లలను పనిలో పెట్టుకోకూడదని చైల్డ్ లేబర్ యాక్ట్ ఉంది. బాల్య వివాహాల నిషేధం, లైంగిక నేరాలకు సంబంధించి నిర్భయ లాంటి చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాలన్నింటితో, ఆయా వర్గాలకు రాజ్యాంగ రక్షణతో ఎలాంటి భద్రత దొరికిందో అలాంటి భద్రతనే సీనియర్ సిటిజన్లకు కల్పించింది ప్రజా ప్రభుత్వం.
మలివయసులో గౌరవప్రదంగా జీవించేలా..
పిల్లలు తమ తల్లిదండ్రులను చూసుకోవడం చట్టబద్ధ బాధ్యతగా చేస్తూ ‘మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆప్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజెన్స్ యాక్ట్ 2007’ ను తీసుకొస్తూ ప్రభుత్వ, ప్రైవేటు, చివరికి చట్టసభల సభ్యులకు సైతం వర్తింపజేశారు. తల్లిదండ్రుల్ని ఎవరైతే పట్టించుకోరో వారి జీతం నుంచి రూ. 10వేలు లేదా 15శాతం జీతంను నేరుగా కట్ చేసి తల్లిదండ్రులకు ఈ చట్టం ద్వారా అందిస్తుంది.
ఇందుకోసం తల్లిదండ్రులు కలెక్టర్‌కి అప్లికేషన్ పెట్టుకుంటే వర్తించేలా రూపొందించారు. సమాజంలో విచ్ఛిన్నమవుతున్న అనుబంధాలను, ఆప్యాయతలను ఈ చట్టం ఆదర్శవంతమైన సమాజాన్ని నిర్మించడానికి బాగా ఉపకరిస్తుంది. ఇంతగొప్ప చట్టాన్ని తీసుకొచ్చిన ప్రజాప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు.
బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి
సీఈవో, టిసాట్ నెట్వర్క్
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీopenpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.
