నేటి ఆధునిక ప్రపంచంలో ప్రపంచీకరణ కారణంగా ఒక దేశ బాగోగులు ఇతర దేశాల సత్సంబంధాలతో ముడిపడి ఉన్నాయి. కావున ప్రపంచంలో ఏ చిన్న మూలన సంఘర్షణ ఏర్పడ్డా వాటి ప్రభావాలు ఇతర దేశాలను ప్రభావితం చేస్తున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య సంఘర్షణలు ప్రపంచంలోని అనేక దేశాలపై ప్రతికూల ప్రభావాలను చూపుతున్నాయి.
ఈ రెండు దేశాల మధ్య సంఘర్షణ తీవ్రతరం కావడం వల్ల ప్రపంచ ఇంధన, ఎరువులు, వ్యవసాయ ఆహార వ్యవస్థలకు అనేక అంతరాయాలు ఏర్పడ్డాయి. సేద్యానికి సంబంధించిన ముఖ్యమైన ముడిసరుకులో ఎరువులు అత్యంత కీలకమైనవి. వాటి సరఫరా
అంతరాయాలు చాలా దేశాల్లో సాగును ప్రభావితం చేయనున్నాయి.
ఇరాన్, ఖతార్, సౌదీ అరేబియా, ఒమన్ వంటి దేశాలు యూరియా, అమ్మోనియాతో సహా నత్రజని ఎరువులను, ఇతర ఎరువుల తయారీకి సంబంధించిన ముడిసరుకు ఎగుమతి చేసే ప్రపంచంలోని ప్రముఖ దేశాలలో ఉన్నాయి. ఇటీవలజరుగుతున్న అలజడులు ప్రపంచంలో ఎరువుల సరఫరాపై తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. ఈ ప్రాంతం ద్వారా సరఫరా అయ్యే ఎరువులు చూసినట్లయితే, ప్రపంచ యూరియా ఎగుమతులలో సుమారు 30–35 శాతం, అమ్మోనియా ఎగుమతులలో దాదాపు 20–30 శాతం వాటాను కలిగి ఉంది.
మొత్తంగా అంతర్జాతీయంగా వర్తకం ఎరువులలో 30 శాతం వరకు సాధారణంగా హార్మూజ్ జలసంధి గుండా రవాణా అవుతాయి. సముద్ర రవాణాకు తీవ్ర అంతరాయం కలగడం, ఉత్పత్తి కేంద్రాలు దెబ్బతినడం లేదా తాత్కాలికంగా మూసివేయటంతో ఎరువుల సరఫరా గొలుసులు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఎరువుల ఉత్పత్తి కోతలు, రవాణా పరిమితుల కారణంగా నెలకు సుమారు 3–4 మిలియన్ టన్నుల ఎరువుల వాణిజ్యం నిలిచిపోయింది.
వ్యూహాత్మక నిల్వలు లేవు
యుద్ధం కారణంగా ప్రపంచ ఎరువుల మార్కెట్లను తీవ్రంగా దెబ్బతీయడంతో, ఆంతర్జాతీయ మార్కెట్లో యూరియా ధర టన్నుకు $684 గరిష్ట స్థాయికి చేరుకున్నది. ఇది అక్టోబర్ 2022 తర్వాత అత్యధిక స్థాయి కాగా, ఈ సంవత్సరంలో వీటి విలువ 70 శాతానికి పైగా పెరిగింది. అదేవిధంగా డై-అమ్మోనియం ధర టన్నుకు సుమారుగా $ 692 చేరుకుంది. గత సంవత్సరం ఇదే సమయంతో పోలిస్తే 18.17 శాతం అధికంగా ఉంది. మరోవైపు దేశీయ సరఫరాను సురక్షితం చేసుకోవడానికి చైనా ఎగుమతి ఆంక్షలను కఠినతరం చేయగా, రష్యా కీలక పోషకాల రవాణాను తగ్గించింది.
మన దేశంలో ఖరీఫ్ నాటికి ఎరువుల డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. ఈ సంక్షోభం ఇలాగే కొనసాగితే, 2026 ప్రథమార్థంలో ప్రపంచవ్యాప్త ఎరువుల ధరలు సగటున 15–20 శాతం మేర పెరిగే అవకాశం ఉందని అంతర్జాతీయ సంస్థలు హెచ్చరించాయి. అంతేకాకుండా ప్రపంచంలో చమురు రంగానికి అంతర్జాతీయ సమన్వయం చేసిన వ్యూహాత్మక నిల్వలు ఉన్నాయి. కానీ, ఎరువుల రంగానికి అంతర్జాతీయంగా సమన్వయం చేసిన వ్యూహాత్మక నిల్వలు లేవు. దీనివల్ల సరఫరా అంతరాయాలను నిర్వహించడం మరింత కష్టతరం అవుతుంది.
సుస్థిర వ్యవసాయం వైపు అడుగులు
ప్రస్తుతం కొనసాగుతున్న సమస్య గతంలో రష్యా, ఉక్రెయిన్ యుద్ధ సమయంలో ఏర్పడ్డ ఎరువుల కొరతలాగే మళ్లీ పునరావృతం అయ్యింది. ఈ పరిణామాలు ప్రపంచ వ్యవసాయ వస్తు మార్కెట్లపై ప్రభావం చూపడం ప్రారంభించాయి. పెరుగుతున్న ఎరువుల ఖర్చులు, అధిక ఇంధన ధరలు రైతుల ఉత్పత్తి వ్యయాలను పెంచుతాయి. అనేక ప్రాంతాలలో ఎరువుల వాడకం తగ్గడానికి దారి తీయవచ్చు. ఎరువుల కొరత వల్ల పంట దిగుబడి తగ్గే ప్రమాదం ఉంది.
పెరిగిన ఇంధన ధరలు వ్యవసాయ కార్యకలాపాలు ఖర్చులను పెరగడానికి దారితీస్తాయి. ఎరువుల కొరత, పెరగనున్న వ్యవసాయ కార్యకలాపాలు రైతుల పాలిట పెనుభారం కానున్న నేపథ్యంలో రైతులకు సాగు భారాన్ని తగ్గించి, ప్రత్యమ్నాయ సాగు పద్ధతులు అవలంబించడం ఎంతైనా అవసరం ఉంది. ప్రస్తుతం కొనసాగుతున్న ఘర్షణల వల్ల ఏర్పడ్డ ఎరువుల కొరతను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయంగా జీవ ఎరువులను వినియోగించాలి. అయితే, ఎరువుల వినియోగంపై శ్రీలంకలో ఏర్పడ్డ సంక్షోభం దృష్టిలో ఉంచుకొనే అలాంటి తప్పిదాలు జరగకుండా దశలవారీగా రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి సుస్థిర
వ్యవసాయం వైపు అడుగులు వెయ్యాలి.
సేంద్రియ, జీవ ఎరువుల వాడకంపై ప్రచారం చేయాలిప్రపంచంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఎరువుల వినియోగ ధోరణి మారాల్సిన అవసరం ఉంది. అయితే, రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయంగా సరిపడా జీవ, సేంద్రియ ఎరువులను సమకూర్చకుండా రసాయన ఎరువుల వినియోగం తగ్గించాలన్నది సరైన సూచన కాదు. రైతులకు సరిపడా జీవ, సేంద్రియ ఎరువులను ఉత్పత్తి చేసి వాటిని ఉపయోగించే దిశగా నడపాలి. అందుకు జీవ, సేంద్రియ ఎరువులను కుడా సబ్సిడీ ద్వారా రైతులకు అందుబాటులో ఉంచినట్లయితే వాటి వినియోగం పెరిగే అవకాశం ఉంది.
అదేవిధంగా ప్రాంతీయంగా ప్రామాణికమైన, సమర్థవంతమైన ప్రత్యామ్నాయ ఎరువుల ఉత్పత్తి, సరఫరా కోసం ప్రాంతీయ వనరుల కేంద్రాలు అవసరం. వ్యవసాయ సమాజంలో సేంద్రియ, జీవ ఎరువుల వాడకం, ప్రయోజనాలపై విస్తృతస్థాయిలో ప్రచారం చెయ్యాలి. అంతేకాకుండా గ్రామీణ యువతను నూతన ఆధునిక కుటీర పరిశ్రమలుగా సేంద్రీయ/ జీవ ఎరువుల కేంద్రాలను ఏర్పర్చి వాటి తయారీకి కావలిసిన మౌలిక సదుపాయాలు కల్పించాలి.
వాటి తయారీకి తగు శిక్షణ కార్యక్రమాలు ఏర్పర్చడం ద్వారా ప్రత్యామ్నాయ ఎరువుల ఉత్పత్తిలో ఎలాంటి అంతరాయాలు లేకుండా నిరంతరం వాటిని అందుబాటులో ఉంచడానికి సాధ్యపడుతుంది. రైతులు రసాయన ఎరువులను వినియోగంలో విపరీత ధోరణిని వదిలి అందులో ప్రధానంగా అధిక యూరియా వినియోగానికి స్వస్తి చెప్పవలసిన తక్షణ అవసరం ఉంది. ఇలా చెయ్యడం వల్ల నేల సారవంతం కాపాడుకొని భవిష్యత్తు తరాల రైతులకు సారవంతమైన నేలలను ఇవ్వగలుగుతాం.
- డా. రేపల్లె నాగన్న
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి.
స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.
