డాలర్ దూకుడు..భారత్ కు సవాళ్లు!

డాలర్ దూకుడు..భారత్ కు సవాళ్లు!

భారతదేశ ఆర్థిక చరిత్రలో రూపాయి విలువ అనేది కేవలం ఒక సంఖ్య కాదు.. అది దేశం అంతర్జాతీయ పరపతికి, ఆర్థిక స్వావలంబనకు,  సామాన్యుడి కొనుగోలు శక్తికి కొలమానం. 1947లో  స్వాతంత్ర్యం  సిద్ధించినప్పుడు రూపాయికి ఒక ప్రత్యేక స్థానం ఉండేది.  అయితే,  దశాబ్దాలు  గడిచేకొద్దీ  ప్రపంచీకరణ, యుద్ధాలు, కరువులు,  మారుతున్న అంతర్జాతీయ రాజకీయ సమీకరణల వల్ల రూపాయి తన విలువను కోల్పోతూ వచ్చింది.  నాడు ప్రభుత్వం కావాలని తీసుకున్న 'డివాల్యుయేషన్' నిర్ణయాల వెనుక ఒక స్పష్టమైన ఆర్థిక వ్యూహం ఉండేది.  కానీ,  నేడు మార్కెట్ శక్తుల వల్ల జరుగుతున్న 'డిప్రిసియేషన్'  దేశ ఆర్థిక వ్యవస్థకు ఒక పెను సవాలుగా మారింది.

'స్థిర  మారకపు రేటు' వ్యవస్థలో   ప్రభుత్వం లేదా సెంట్రల్ బ్యాంక్ (ఆర్బీఐ) అధికారికంగా కరెన్సీ విలువను  తగ్గించడాన్ని 'డివాల్యుయేషన్' అంటారు.  ఇది  ఎగుమతులను  ప్రోత్సహించడానికి తీసుకునే ఒక వ్యూహాత్మక నిర్ణయం. దీనికి విరుద్ధంగా,  ప్రస్తుతం అమలవుతున్న 'మారుతున్న  మారకపు  రేటు'  వ్యవస్థలో మార్కెట్ శక్తులైన డిమాండ్,  సప్లై ఆధారంగా రూపాయి విలువ ఆటోమేటిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా తగ్గడాన్ని 'డిప్రిసియేషన్' అని పిలుస్తారు.  రూపాయి విలువ  డాలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో  పోలిస్తే  ₹94 స్థాయికి  చేరువవుతుండటం  సామాన్యుడి నుంచి కార్పొరేట్ దిగ్గజాల వరకు గుబులు  రేపుతోంది.

చారిత్రిక కోణం

భారతదేశం 1991 కంటే  ముందు  మూడు  ప్రధాన సందర్భాల్లో తన కరెన్సీ విలువను  కావాలని తగ్గించుకుంది.  వీటిని ఆర్థిక పరిభాషలో 'డివాల్యుయేషన్' అంటారు.  ఈ నిర్ణయాలు అప్పట్లో అనివార్యమైనప్పటికీ, అవి దేశ ఆర్థిక గమనాన్ని మార్చేశాయి.   స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో  మన  ఆర్థిక వ్యవస్థ  బ్రిటన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై  ఎక్కువగా  ఆధారపడి ఉండేది. 1949లో  బ్రిటన్  తన  పౌండ్  విలువను  తగ్గించినప్పుడు,  మన ఎగుమతుల పోటీతత్వాన్ని కాపాడటానికి తొలిసారి రూపాయి విలువను తగ్గించారు.  అప్పట్లో ఇది ఒక 'రక్షణాత్మక' చర్యగా నిలిచింది.  1960వ  దశకం భారత ఆర్థిక వ్యవస్థకు  ఒక  పరీక్షా కాలం. 

1962లో చైనాతో,  1965లో  పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో  జరిగిన  యుద్ధాలు  రక్షణ బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పెంచాయి. దీనికితోడు వరుస  కరువులు ఆహార సంక్షోభాన్ని సృష్టించాయి.  విదేశీ సాయం కోసం అంతర్జాతీయ సంస్థల ఒత్తిడి మేరకు 1966 జూన్ 6న నాటి ప్రధాని ఇందిరా గాంధీ రూపాయి  విలువను  సుమారు 36.5%  తగ్గించారు.  దీనితో డాలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో రూపాయి విలువ రూ. 4.76 నుంచి  రూ.7.50 కి పెరిగింది.   భారత చరిత్రలోనే  అత్యంత  భయంకరమైన ఆర్థిక సంక్షోభం ఇది.   

గల్ఫ్ యుద్ధం కారణంగా చమురు ధరలు పెరగడం,  దేశంలో  రాజకీయ  అనిశ్చితి వల్ల విదేశీ మారక నిల్వలు కేవలం $1.2 బిలియన్లకు  పడిపోయాయి.  ఇది కేవలం రెండు వారాల దిగుమతులకు మాత్రమే సరిపోయే స్థితి.  దేశం  దివాలా  తీయకుండా ఉండటానికి ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ తన వద్ద ఉన్న  బంగారాన్ని  లండన్,  స్విట్జర్లాండ్  బ్యాంకుల్లో  కుదువపెట్టాల్సి వచ్చింది.  ఈ నేపథ్యంలోనే  ప్రభుత్వం  రూపాయి  విలువను  భారీగా తగ్గించి, ఆర్థిక సరళీకరణ   బాట పట్టింది. నాటి ఆ 'వ్యూహాత్మక  వెనకడుగు' నేటి  బలమైన  ఆర్థిక  పునాదికి  కారణమైంది.

రూపాయి పతనం-మార్కెట్ మాయ!

1993 తర్వాత భారత్  'ఫ్లోటింగ్ ఎక్స్ఛేంజ్ రేట్'  విధానాన్ని  అనుసరిస్తోంది. అంటే  రూపాయి విలువను  ప్రభుత్వం నిర్ణయించదు.  మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  డాలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఉన్న డిమాండ్,  సప్లై ఆధారంగా  అది  మారుతుంటుంది.  దీనినే 'డిప్రిసియేషన్' అంటారు.  నేడు  రూపాయి పతనానికి ప్రభుత్వం కారణం కాదు,  అంతర్జాతీయ పరిణామాలు కారణం.  అమెరికా, --ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య మొదలైన యుద్ధం ప్రపంచ ఇంధన మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అతలాకుతలం చేస్తోంది.  

ఫిబ్రవరి 28, 2026న  ఇరాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై  జరిగిన దాడుల తర్వాత 'హార్మూజ్ జలసంధి' గుండా చమురు రవాణా నిలిచిపోవడంతో,  అంతర్జాతీయ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ముడి చమురు ధర బ్యారెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు  $150  మార్కును దాటింది. భారత్ తన చమురు  అవసరాల్లో 85%  దిగుమతి  చేసుకుంటుంది కాబట్టి,  ఈ ధరల పెరుగుదల వల్ల మన దిగుమతి బిల్లు భారీగా పెరిగి విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పెంచుతోంది.  డాలర్లకు  విపరీతమైన  డిమాండ్ ఏర్పడటంతో రూపాయి విలువ  ₹94 స్థాయికి  పడిపోతోంది.

ఈ అనిశ్చితి వల్ల విదేశీ పెట్టుబడిదారులు  భారత మార్కెట్ల నుంచి సుమారు $15-20 బిలియన్ల  నిధులను ఉపసంహరించుకుని అమెరికా బాండ్ల వైపు మళ్లడం  రూపాయి పతనానికి ఆజ్యం పోస్తోంది.  ఇలాంటి  క్లిష్ట పరిస్థితుల్లోనూ ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ తన వద్ద ఉన్న $700 బిలియన్ల  నిల్వలను   రక్షణ  కవచంలా వాడుతూ మార్కెట్లో జోక్యం చేసుకుంటున్నప్పటికీ,  దిగుమతి చేసుకున్న ద్రవ్యోల్బణం  వల్ల  దేశంలో  రవాణా  ఖర్చులు  పెరిగి సామాన్యుడిపై  ధరల భారం పడుతోంది.

విదేశీ మారక నిల్వలు మనకు ఎందుకు ముఖ్యం?

భారతదేశ విదేశీ మారక నిల్వలు నాలుగు కీలక అంశాల సమాహారం.  విదేశీ కరెన్సీ ఆస్తులు,  బంగారు నిల్వలు,  ప్రత్యేక డ్రాయింగ్ హక్కులు,  ఐఎంఎఫ్​ వద్ద  రిజర్వ్ ట్రెంచ్ పొజిషన్.  ఇవి మనకు మూడు రకాలుగా ఉపయోగపడతాయి.    ప్రస్తుత  నిల్వలు 10-–11 నెలల  దిగుమతులకు సరిపోతాయి (1991లో  ఇది  కేవలం 15 రోజులే). పెట్టుబడిదారుల  నమ్మకం,  తగినంత  డాలర్  నిల్వలు ఉంటేనే  విదేశీ  కంపెనీలు  భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  పెట్టుబడి పెడతాయి.

అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ ఒక్కసారిగా కుప్పకూలకుండా  ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ ఈ నిధులతో 'బ్యాలెన్సింగ్' చేస్తుంది.  డాలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై  ఆధారపడటాన్ని తగ్గించడానికి భారత్  వ్యూహాత్మకంగా రూపాయి సెటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ సిస్టమ్​ను  ప్రవేశపెట్టింది.  ఇప్పటికే రష్యా,  యూఏఈ,  శ్రీలంక వంటి దేశాలతో  రూపాయిల్లోనే   వాణిజ్యం  జరపడానికి  ఒప్పందాలు  కుదుర్చుకుంది.  రష్యాతో  చమురు  దిగుమతులకు 'వోస్ట్రో' ఖాతాల ద్వారా చెల్లింపులు  జరపడం  రూపాయి  పతనం వల్ల  కలిగే  నష్టాన్ని  కొంతవరకు  తగ్గిస్తోంది. 

రూపాయి బలపడాలంటే.. 

ముడి చమురుపై  ఆధారపడటాన్ని తగ్గించి,  ఎలక్ట్రిక్ వాహనాలు,  పునరుత్పాదక ఇంధనం వైపు మళ్లడం ద్వారా విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయవచ్చు.  నాడు 1991లో రూపాయి పతనం మనకు సంస్కరణల ద్వారా కొత్త ద్వారాలు తెరిచింది. నేడు మారుతున్న ఈ విలువ మనల్ని  స్వయం సమృద్ధి  ('ఆత్మనిర్భర్') దిశగా  మరింత వేగంగా పరుగెత్తాలని హెచ్చరిస్తోంది.  రూపాయి విలువను కాపాడుకోవడం అనేది  కేవలం ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ  బాధ్యత మాత్రమే కాదు,   అది  దేశీయ  ఉత్పత్తి  సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. 

'మేక్ ఇన్ ఇండియా' ద్వారా ఉత్పాదక రంగంలో ఎగుమతులను పెంచడం, దిగుమతులను తగ్గించుకోవడం ద్వారా మాత్రమే రూపాయికి అసలైన  స్థిరత్వం లభిస్తుంది. అంకెల గారడీ పక్కన పెడితే,  రూపాయి బలం దేశ ఉత్పాదకతలో ఉంది. మనం కేవలం దిగుమతిదారులుగానే  కాకుండా,  ప్రపంచానికి వస్తువులను అందించే 'మాన్యుఫాక్చరింగ్ హబ్'గా  మారినప్పుడే  రూపాయి  ప్రపంచ యవనికపై  గంభీరంగా  నిలబడగలదు. 

- చిట్టెడ్డి కృష్ణారెడ్డి, అసోసియేట్ ప్రొఫెసర్
హైదరాబాద్  సెంట్రల్  యూనివర్సిటీ

ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీopenpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.