"నీ స్నేహితుడెవరో చెబితే.. నువ్వెలాంటివాడివో చెబుతా": దుర్యోధన-కర్ణుల మైత్రి వెనుక అసలు నిజం!

"నీ స్నేహితుడెవరో చెబితే.. నువ్వెలాంటివాడివో చెబుతా": దుర్యోధన-కర్ణుల మైత్రి వెనుక అసలు నిజం!

‘నీ స్నేహితులు ఎవరో చెప్పు .. నువ్వు ఎలాంటివాడివో నేను చెబుతాను' అనే మాట అక్షరాలా నిజం. ఎందుకంటే అభిరుచులు," అభిప్రాయాలు కలవకుండా ఎవరూ స్నేహితులు కాలేరు. ఇంచుమించు వాళ్ల స్వభావాలు ఒక్కటే అని అర్థం చేసుకోవచ్చు. అయితే మహాభారతంలో దుర్యోధనుడు-కర్ణుడి స్నేహం ఒక కొత్త పాఠం నేర్పిస్తుంది. వ్యక్తిత్వాలు ఎలాంటివైనా .. ధర్మం వైపు నిలబడితేనే మంచిది. అలా కాకుండా అధర్మం వైపు నిలబడితే చివరకు పతనం తప్పదని చెబుతుంది వీళ్ల స్నేహం.

దుర్యోధనుడి జీవితకాలంలో తన  కంటే పాండవులను గురించి ఎక్కువగా ఆలోచించాడు. పాండవులకు అధికారం, సంతోషం రెండూ దక్కకూడదని కుట్రలు చేస్తుంటాడు. అలాంటి పరిస్థితుల్లోనే దుర్యోధనుడు, కర్ణుడు కలుస్తారు. అర్జునుడిని ఎదిరించగలిగిన వీరుడు కర్ణుడే అని గ్రహించి.. అతన్ని అంగ రాజ్యానికి రాజును చేస్తాడు. అప్పటికే అవమాన భారంతో నిస్సహాయంగా నిలిచిపోయిన కర్ణుడి ఆత్మాభిమానాన్ని కాపాడి తన వైపుకు తిప్పుకుంటాడు దుర్యోధనుడు.

దుర్యోధనుడు తన ఆత్మాభిమానాన్ని కాపాడాడు. తన శౌర్య పరాక్రమాలను అందరిముందు ప్రదర్శించే అవకాశం కల్పించాడు. అది చాలు. ఇక దుర్యోధనుడు ఏది ఆదేశిస్తే అది చేయాలని కర్ణుడు నిర్ణయించుకుంటాడు. ఆ క్షణం నుంచి దుర్యోధనుడు చేసే అక్రమాలకు అడ్డు చెప్పడు. పైగా తానూ ఆ పాపాల్లో పాలుపంచుకుంటాడు. ద్రౌపది వస్త్రాపహరణ సమయంలో.. ద్రౌపది పట్ల దుర్యోధనుడు కఠినంగా వ్యవహరించడానికి కర్ణుడు కొంత కారణం అవుతాడు.

ALSO READ : షాపుకు ఎదురుగా ఇంటి మూల ఉంటే దోషమా? చనిపోయిన వారి ఫోటో ఎక్కడ పెట్టాలి ?

స్నేహ ధర్మం
పాండవులపై యుద్ధం దుర్యోధనుడి కోరిక. ఆ యుద్ధంలో విజయం సాధించడం అతని ఆశయం. దుర్యోధనుడి కోరిక తీర్చడానికి.. ఆశయాన్ని నెరవేర్చడానికి తాను నిలబడాలి, పాండవులతో కలబడాలి అన్నట్లుగా కర్ణుడు వ్యవహరిస్తాడు. తన ఆత్మాభిమానం కాపాడాడు కనుకే దుర్యోధనుడి వెంట నడవడం తన బాధ్యతగా భావించాడు కర్ణుడు. స్నేహానికి ప్రాధాన్యం ఇచ్చాడేగానీ అధర్మం, అన్యాయం, అక్రమం లాంటి విషయాలను అస్సలు పట్టించుకోలేదు. కురుక్షేత్రంలో అభిమన్యుడిని పసివాడుగా కాకుండా.. అర్జునుడికి కొడుకుగా భావించి అతనిపైకి బాణం సంధించాడు. అంటే కర్ణుడు నిజంగా అంతటి కఠినాత్ముడా?  దాన గుణంలో కర్ణుడిని మించినవాడు లేడని సాక్షాత్తు శ్రీకృష్ణుడే అంటాడు. 

అలాంటి కర్ణుడు తన జన్మరహస్యం గురించి బయట ప్రపంచానికి చెప్పకుండా దాచిపెట్టి.. అవమానాలను ఎదుర్కోవడానికి కారకురాలైన తల్లి విషయంలో ఓర్పు వహిస్తాడు. పాండవుల జోలికి వెళ్లవద్దని కుంతీదేవి కోరితే.. 'ఒక్క అర్జునుడిని మాత్రమే ఎదుర్కొంటాన'ని మాట ఇస్తాడు. అది కూడా చేయకపోతే స్నేహ ధర్మాన్ని తప్పినవాడిని అవుతానని కుంతీదేవితో చెప్తాడు. భీష్ముడు అంపశయ్యపై ఆఖరి ఘడియల్లో ఉన్నప్పుడు.. గతంలో తాను దురుసుగా ప్రవర్తించినందుకు మన్నించమని కోరతాడు కర్ణుడు. 

ఇక అర్జునుడిని కాపాడటం కోసమే దేవేంద్రుడు తన కవచ కుండలాలు దానంగా అడుగుతున్నాడని తెలిసి కూడా.. మనస్ఫూర్తిగా వాటిని ఇచ్చేస్తాడు. సందేహాలు పక్కనపెట్టి.. నిజంగా అర్జునుడిని ఓడించే సత్తా కర్ణుడికి ఉందా?. ఘోష యాత్ర సమయంలో చిత్రసేనుడు అనే గంధర్వుడిని కర్ణుడు ఓడించలేకపోతాడు. ఆ గంధర్వుడి బారి నుంచి దుర్యోధనుడిని సైతం కాపాడలేకపోతాడు. అలాగే విరాటరాజు గోవులను కౌరవులు తరలించేటప్పుడు అర్జునుడు వాళ్ల వెంటపడతాడు. అప్పుడు కర్ణుడు అక్కడే ఉండి కూడా అర్జునుడిని ఆపలేకపోతాడు. 

అయితే ఈ ఓటములను కళ్లారా చూసి కూడా కర్ణుడిపై దుర్యోధనుడు నమ్మకం పెట్టుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. పాండవుల్ని ఓడించే 'తిరుగులేని అస్త్రం' కర్ణుడే అని కడదాకా బలంగా నమ్మాడు దుర్యోధనుడు. అంతేకాదు స్నేహానికి నిజమైన నిర్వచనం ఒక్క కర్ణుడే అని దుర్యోధనుడు భావించాడు. తన స్నేహితుడి కోసం తన పిల్లలను యుద్ధభూమిలోకి దింపి, వాళ్లను పోగొట్టుకున్న త్యాగం కర్ణుడి ఖాతాలో కనిపిస్తుంది. రణరంగంలో తన ప్రాణాలు పోతున్నప్పుడు కూడా.. 'స్నేహితుడి కోరిక, ఆశయాన్ని నెరవేర్చలేకపోయానే' అని కర్ణుడు బాధపడతాడు. ఇక దుర్యోధనుడు కూడా తొంభై తొమ్మిది మంది సోదరులను పోగొట్టుకున్నందుకు కాకుండా.. కర్ణుడు చనిపోయినప్పుడే ఎక్కువగా విలపిస్తాడు. 

ధర్మం త్యజిస్తే..
శాంతిని కోరేది స్నేహం. కానీ దుర్యోధనుడు - కర్ణుడి స్నేహం హింసను వుసిగొల్పింది. కర్ణుడి అండ చూసుకుని దుర్యోధనుడు చెలరేగిపోతే.. దుర్యోధనుడి భరోసాతో ధర్మంకాని పనులలో కర్ణుడు ధైర్యం చూపాడు. నిజానికి కర్ణుడిలో గొప్పగుణాలు ఉన్నాయి. కానీ, సావాస దోషం, ఆ సావాసం వల్లే మంచి మార్గంలో నడవలేకపోవడం అతని పతనానికి కారణమైంది. ధర్మం కోసం స్నేహాన్ని త్యాగం చేయవచ్చు. కానీ, స్నేహ ధర్మం పేరుతో ధర్మాన్ని వదిలిపెట్టకూడదు. ఈ సత్యాన్ని గ్రహించలేకపోయాడు కర్ణుడు. కేవలం దుర్యోధనుడి అధర్మ వైఖరి కారణంగానే కర్ణుడి వీరత్వానికి అర్థం లేకుండా పోయింది. ఎంతటి వీరుడైనా, మరెంతటి పరాక్రమవంతుడైనా అధర్మాన్ని ఆశ్రయిస్తే అపజయం తప్పదనడానికి కర్ణుడి జీవితమే ఒక ఉదాహరణ!. అది ఏకాలంలో అయినా చివరికి ధర్మమే గెలుస్తుందని మహాభారతం నిరూపించింది.

– పెద్దింటి గోపీకృష్ణ