హాలీవుడ్ సినిమాల్లో అంగారక గ్రహానికి వెళ్లొచ్చే సీన్స్ చూస్తుంటే.. మనం కూడా ఒకసారి చూస్తే ఎలా ఉంటుందనే ఫీలింగ్ వస్తుంటుంది కదా. కొన్ని సినిమాల్లో ముందుగానే ఊహించి వింతగా అనిపించే చెట్లు, ఇసుక దిబ్బలు, విచిత్రమైన రాళ్లు చూపిస్తుంటారు. అయితే మార్స్ గ్రహంపై ఉండే అలాంటి వాతావరణం మన భూమి మీద కూడా చాలా ప్లేస్ లలో ఉంది. ముఖ్యంగా మన పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో రెడ్ డ్యూన్ ఫారెస్ట్ (ఎర్ర దిబ్బల అడవి) మరో గ్రహంలో ఉన్న వాతావరణాన్ని పరిచయం చేసే అద్భుతమైన డెస్టినేషన్.
తేరి కాడు (Theri Kaadu) అనే ఈ ఎర్రదిబ్బల అడవి.. తమిళనాడులోని తూత్తుకుడి, తిరునెల్వేలి జిల్లాల్లో విస్తరించి ఉన్న ఒక అద్భుతమైన ఎర్ర ఇసుక ఎడారి. దక్షిణ భారతదేశంలో ఇదొక్కటే ఎర్రటి ఇసుకతో కూడిన ఎడారి. తేరీ కాడూ అనే ఈ అడవి.. ఎర్రని ఇసుక దిబ్బలతో.. ఎప్పుడూ చూడని చెట్లతో నిండి ఉంటుంది. ముఖ్యంగా అంగారక గ్రహం (మార్స్) లో అందమైన, ఆశ్చర్యకరమైనా వాతావరణాన్ని ఇక్కడ చూడవచ్చు . ఈ ఇసుక దిబ్బలపై నడుస్తుంటే లక్షదీవులలో ఉండే నీలి సముద్రానికి వ్యతిరేకమైన రంగులో ఉండే ఇసుక రంగు ఒక కొత్త అనుభూతిని కలిగిస్తుంది. దీన్నే ఎర్ర ఇసుక ఎడారి అని.. రెడ్ డ్యూన్ ఫారెస్ట్ అని పిలుస్తుంటారు.
భూ గ్రహం పూర్వం ఎలా ఉండేదో ఈ ఎడారిని చూస్తే అర్థమవుతుందని శాస్త్రవేత్తలు చెబుతుంటారు. వందల ఏళ్ల నుంచి ఇనుప (ఐరన్) రేణువులు ఆక్సిడేషన్ పొందటం వలన.. లైమ్ నైట్, గార్నెట్ లాంటి మినరల్స్ ఉండటం వలన ఎర్రని రంగును వెదజల్లినట్లుగా.. మార్స్ (అంగారక గ్రహం) ఉపరితలాన్ని తలపించేలా ఎరుపు రంగులో ఉంటుంది. వివిధ రుతువులలో వచ్చే గాలుల కారణంగా ఇసుక దిబ్బల రూపంలో పేరుకుపోయి ఉంటుంది. ముళ్ల పొదలు, తాటి చెట్లు సహజసిద్దంగా ఏర్పడిన ఇతర వృక్షాలు అద్భుతంగా ఉంటాయి.
విస్తీర్ణం: ఈ సహజ అద్భుతం సుమారు 500 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది.
సమీప ప్రాంతాలు: ఇది తిరుచెందూర్ ఆలయానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. త్రివేండ్రం నుండి 3 గంటల ప్రయాణం.
ప్రత్యేకత: చరిత్ర పూర్వ కాలంలో సముద్రంలో భాగమైన ఈ ప్రాంతం, వేల సంవత్సరాలుగా గాలి, వాతావరణ మార్పుల కారణంగా ఇలా ఎడారిగా మారింది
రెడ్ డ్యూన్ ఫారెస్ట్ రహస్యం:
తమిళనాడు నైరుతి తీరంలో ఉన్న ఎర్ర ఇసుక దిబ్బల (తేరీ సాండ్స్) అడవి.. వేల సంవత్సరాలుగా క్వార్ట్జ్ రేణువులపై ఐరన్ ఆక్సైడ్ (హెమటైట్) పూత ఏర్పడటం వల్ల వీటికి ఆ పేరు వచ్చింది. ఈ పర్యావరణ వ్యవస్థ కేవలం కంటికి ఇంపుగా కనిపించే అద్భుతం మాత్రమే కాదని, ఇందులో ఎంతో ఖనిజ సంపద దాగి ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఈ పురాతన తేరి ఇసుక, కాలం, అలలచే చెక్కబడిన ఒక ఎరుపు రంగు కళాఖండంగా కనిపిస్తున్నట్లు సైంటిస్టులు చెబుతున్నారు. ఇక్కడ వేల సంవత్సరాలుగా ఆక్సీకరణ చెందిన ఖనిజాల వల్ల భూమి గాఢమైన, తుప్పుపట్టిన నారింజ రంగులోకి మారింది. ఇది ఒక అద్భుతమైన తీరప్రాంతం. ప్రకృతియే అన్నింటికన్నా గొప్ప సృజనాత్మక కళాకారిణి అని చెప్పేందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ అంటుంటారు.
విశిష్టమైన జీవవైవిధ్యం (బయోడైవర్సిటీ)
తేరి కాడులోని ఎర్ర ఇసుక దిబ్బల అడవి కేవలం ఒక భౌగోళిక అద్భుతం మాత్రమే కాదు. అది ఒక సజీవ జీవావరణ వ్యవస్థ. ఇక్కడ కఠినమైన వాతావరణంలో వివిధ రకాల వృక్ష జీవజాతులు వృద్ధి చెందుతున్నాయి. ఈ అడవిలో, దృఢమైన తాటి చెట్లు, జీడి చెట్లు కదులుతున్న ఎర్రటి ఇసుకను పట్టి ఉంచుతాయి. దీనికి తోడు ఇక్కడ సహజంగా నేల నుంచి ఉబికి వచ్చే సునై అని పిలువబడే నీటి బుగ్గలు ఆకట్టుకుంటాయి. ఈ మంచినీటి బుగ్గలు మొక్కలకు, జంతువులు, పక్షులు , కీటకాలకు జీవనాధారంగా ఉంటాయి.
ఎలా వెళ్లాలి..?
హైదరాబాద్ నుంచి తేరి కాడు కు 1175 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది తమిళనాడులోని తూత్తుకుడి (Tuticorin) జిల్లాలో, కుతిరైమోళి (Kuthiraimozhi) సమీపంలో ఉన్న ఈ డెస్టినేషన్ కు సుమారు 18–22 గంటల సమయం పడుతుంది.
హైదరాబాద్ నుంచి బెంగళూరుకు NH44 ద్వారా 570 కి.మీ వెళ్లాల్సి ఉంటుంది. బెంగళూరు నుంచి సేలం మరో 200 కి.మీ NH44 లేదా NH48 ద్వారా వెళ్లాలి. సేలం నుంచి మదురై లేదా తిరునల్వేలి NH44 లేదా NH38 ద్వారా చేరుకోవాలి. తిరునల్వేలి లేదా తూత్తుకుడి నుంచి తిరుచెందూర్ .. అక్కడి నుంచి తేరి కాడు కు చేరుకోవాలి.
తీర ప్రాంతం గుండా వెళ్లే మార్గం:
దూరం ఎక్కువైనా పర్లేదు.. సముద్ర తీరాన్ని ఆస్వాదిస్తూ వెళ్లాలనుకుంటే ఇది మరో మార్గం. హైదరాబాద్ → విజయవాడ → చెన్నై → తిరుచెందూర్ వెళ్లాల్సి ఉంటుంది. తేరి కాడు వెళ్లాలనుకుంటే ఉత్తమ సమయం అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు అని గైడ్స్ చెబుతున్నారు.
