కేటీఆర్ కు గొప్పలు చెప్పుకునే వ్యాధి: బల్మూరి వెంకట్

కేటీఆర్ కు గొప్పలు చెప్పుకునే వ్యాధి: బల్మూరి వెంకట్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేటీఆర్‌కు గొప్పలు చెప్పుకునే వ్యాధి వచ్చిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అధికారంలో లేకపోయినా కేటీఆర్ ఇంకా తనను తాను మంత్రిలాగే ఫీల్ అవుతున్నారని ఎద్దేవా చేశారు.

వందల మందిని పోగేసుకుని టిమ్స్  ఆస్పత్రిని సందర్శిస్తూ... అక్కడ అంతా తామే చేశామంటూ కేటీఆర్ గొప్పలు చెప్పుకుంటున్నారని బల్మూరి వెంకట్ మండిపడ్డారు. గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన ఆందోళనల వల్లే 2021లో టిమ్స్ ఆస్పత్రి నిర్మాణం చేపట్టారని ఆయన గుర్తు చేశారు.

తాము అధికారంలోకి వచ్చిన వెంటనే యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుని... పెండింగ్‌లో ఉన్న టిమ్స్  ఆస్పత్రి నిర్మాణాన్ని పూర్తి చేశామని బల్మూరి వెంకట్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో పూర్తి చేసిన కనీసం ఒక్క ప్రభుత్వ ఆస్పత్రి పేరు చెప్పే దమ్ము కేటీఆర్‌కు ఉందా? అని ప్రశ్నించారు. కేటీఆర్ కేవలం క్రెడిట్ కోసం ఆరాటపడుతున్నారంటూ బల్మూరి వెంకట్ విమర్శలు గుప్పించారు.