ప్రపంచ పటంలో ఉంటారో లేదో తేల్చుకోండి: పాక్‏కు భారత ఆర్మీ చీఫ్ బిగ్ వార్నింగ్

ప్రపంచ పటంలో ఉంటారో లేదో తేల్చుకోండి: పాక్‏కు భారత ఆర్మీ చీఫ్ బిగ్ వార్నింగ్

న్యూఢిల్లీ: పాకిస్తాన్‎కు భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పాకిస్థాన్ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తూ భారతదేశానికి వ్యతిరేకంగా కార్యకలాపాలు కొనసాగిస్తే ఆ దేశ ఉనికికే ప్రమాదం ఏర్పడుతుందని ఘాటు హెచ్చరికలు పంపారు. శనివారం (మే 16) ఢిల్లీలోని మానేక్‌షా సెంటర్‌లో జరిగిన సేన సంవాద్ కార్యక్రమంలో జనరల్ ఉపేంద్ర ద్వివేది పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా గత సంవత్సరం ఆపరేషన్ సింధూర్‌కు దారితీసిన పరిస్థితులు మళ్లీ తలెత్తితే భారత సైన్యం ఎలా స్పందిస్తుందనే ప్రశ్న ఆయనకు ఎదురు కాగా.. పాకిస్థాన్ గనుక భారతదేశానికి వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం ఆపకపోతే భౌగోళికంగా (ప్రపంచ పటంలో) ఉండాలా లేదా కేవలం చరిత్రలో భాగం కావాలా అనేది ఆ దేశమే తేల్చుకోవాలని హెచ్చరించారు. 

పాక్ మళ్లీ కవ్వింపు చర్యలకు పాల్పడితే ఇండియా ఏ మాత్రం సంకోచించకుండా ఒక అడుగు ముందుకు వేసి నిర్ణయాత్మక చర్యలు తీసుకుంటుందని తమ వైఖరిని స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ ప్రదర్శించిన సంయమనాన్ని ఈసారి చూపించమని.. ఈసారి దూకుడుగా వెళ్తామని పేర్కొన్నారు. 

జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో 2025, ఏప్రిల్ 22న పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు మారణహోమం సృష్టించిన విషయం తెలిసిందే. పహల్గాంలోని పచ్చని ప్రకృతి అందాలు తిలకిద్దామని వచ్చిన పర్యాటకులపై పాక్ ఉగ్రమూకలు బుల్లెట్ల వర్షం కురిపించారు. ఈ టెర్రర్ ఎటాక్‎లో మొత్తం 26 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఈ క్రమంలో ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తోన్న పాకిస్థాన్కు తగిన బుద్ధి చెప్పేందుకు ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్, పీవోకేలోని ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేసేందుకు 2025, మే 10న ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఈ ఆపరేషన్లో భాగంగా పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి మరీ భారత సైన్యం దాడులు చేసి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది.