బెంగళూర్: ప్లే ఆఫ్స్ ముంగిట డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ (ఆర్సీబీ) జట్టులో కీలక మార్పు చోటు చేసుకుంది. శ్రీలంక పేసర్ నువాన్ తుషార్ స్థానంలో ఇంగ్లాండ్ సీనియర్ బౌలర్ రిచర్డ్ గ్లీసన్ ఆర్సీబీ జట్టులోకి వచ్చారు. ఈ విషయాన్ని ఆర్సీబీ యాజమాన్యం శుక్రవారం (మే 15) అఫిషియల్‌గా అనౌన్స్ చేసింది.
శ్రీలంక క్రికెట్ బోర్డు నుంచి ఎన్వోసీ రాకపోవడంతో ఐపీఎల్ టోర్నీకి దూరమైన నువాన్ తుషారా స్థానంలో ఇంగ్లాండ్ పేసర్ రిచర్డ్ గ్లీసన్‌ను రూ. 1.6 కోట్లకు జట్టులోకి తీసుకున్నట్లు ఆర్సీబీ ప్రకటించింది. 38 ఏళ్ల గ్లీసన్ ఇంగ్లాండ్ తరపున ఆరు అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించి తొమ్మిది వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ 2024లో చెన్నై సూపర్ కింగ్స్, ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడాడు. కానీ అతడికి పెద్దగా అవకాశాలు రాలేదు.
కీలకమైన నాకౌట్ పోరులో ఈ అనుభవజ్ఞుడైన పేసర్ తమ బౌలింగ్ విభాగాన్ని మరింత బలోపేతం చేస్తాడని ఆర్సీబీ భావిస్తోంది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన ఆర్సీబీ అందుకు తగ్గట్లుగా ఆడుతోంది. ఈ సీజన్లో ఇప్పటి వరకు 12 మ్యాచులు ఆడిన ఆర్సీబీ 8 విజయాలు, నాలుగు పరాజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. 16 పాయింట్లతో ఆర్సీబీ ప్లే ఆఫ్స్ బెర్తును దాదాపు ఖరారు చేసుకుంది.
