ఫోన్‌లో రీచార్జ్ ముగిసిన తరువాత ఇన్‌కమింగ్ కాల్స్ కూడా నిలిచిపోవడం ప్రస్తుతం చాలామంది వినియోగదారులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యగా మారింది. ఒకప్పుడు చిన్న ఫోన్లు వాడే వారికి తక్కువ ధరల్లో, ఎక్కువ రోజులపాటు పనిచేసే సింపుల్ ప్లాన్స్ అందుబాటులో ఉండేవి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. టెలికాం కంపెనీలు ఎక్కువగా స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల కోసం డేటా- ఆధారిత ప్లాన్స్‌పైనే దృష్టి పెట్టి, చిన్న ఫోన్ వినియోగదారులను పట్టించుకోకుండా ఉన్నట్టు కనిపిస్తోంది.
ఇప్పటి ప్లాన్స్ ఎక్కువగా డేటా, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు, ఇతర అదనపు సౌకర్యాలతో వస్తున్నాయి. చాలామంది వినియోగదారులకు ఇవి అవసరం లేకపోయినా ఆ ప్లాన్స్‌నే తీసుకోవాల్సి వస్తోంది. అంటే, ఒక వ్యక్తికి కేవలం కాల్స్, ఓటీపీలు అవసరం ఉన్నా, అతను డేటా ప్లాన్ కోసం కూడా డబ్బు చెల్లించాల్సి వస్తోంది. దీనివల్ల అవసరానికి మించిన ఖర్చు పెరుగుతోంది. ప్రస్తుతం డిజిటల్ యుగంలో మొబైల్ ఫోన్ ఒక తప్పనిసరి సాధనంగా మారింది. బ్యాంకింగ్ సేవలు, ఆధార్ లింకింగ్, రేషన్ వద్ద, ప్రభుత్వ సేవలు ఇవి అన్నింటికీ ఓటీపీలు చాలా కీలకం. అందు వల్ల మొబైల్ కనెక్షన్ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండాలి. కానీ రీచార్జ్ లేకపోతే ఇన్‌కమింగ్ కాల్స్ కూడా ఆగిపోవడం వలన, వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితిని టెలికాం కంపెనీలు తమ లాభాల కోసం ఉపయోగించుకుంటున్నాయనే భావన కలుగుతోంది.
భారత టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ(ట్రాయ్) అనే నియంత్రణ సంస్థ ఉన్నప్పటికీ, ఈ సమస్యలపై తగిన చర్యలు తీసుకోవడం లేదు. ట్రాయ్ ప్రధాన బాధ్యత టెలికాం రంగాన్ని నియంత్రించడం, విని యోగదారుల హక్కులను రక్షించడం. కానీ, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో, కంపెనీలు తమ ఇష్టానుసారం ప్లాన్స్ రూపొందిస్తున్నట్టు అనిపిస్తోంది. భారత ప్రభుత్వం కూడా టెలికాం కంపెనీల గుత్తాధిపత్యంపై తగినంత దృష్టి సారించకపోవడం బాధాకరం. . ఈ పరిస్థితిని మార్చడానికి ట్రాయ్, ప్రభుత్వం కలిసి పని చేసి, వినియోగదారులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలి.
- నర్ల మహేష్
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.
