హసన్ పర్తి,వెలుగు : హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండల కేంద్రంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ కు నిరసన సెగ తగింది. బుధవారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేయడానికి వచ్చిన ఎమ్మెల్యేను మండల కేంద్రంలోని నెహ్రూ నగర్ కాలనీ మహిళలు, యువకులు అడ్డుకున్నారు. కాలనీలో రోడ్లు నిర్మాణం, డ్రైనేజీ తదితర సమస్యలు పరిష్కరించాలని కారును అడ్డగించారు. డ్రైనేజీ సమస్యను తట్టుకోలేకపోతున్నామని, మిషన్ భగీరథ నీళ్లు సరిగా రావడం లేదని నిలదీశారు. కాలనీలో ఇండ్లు లేని పేద కుటుంబాలు ఉన్నాయని , వారికి గృహలక్ష్మీ స్కీం వర్తింపజేయాలన్నారు. స్పందించిన ఎమ్మెల్యే అరూరి అతి తొందర్లో కాలనీలో నీటి సమస్య పరిష్కరించడంతో పాటు, రోడ్లు, డ్రైనేజీలు నిర్మించడానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో 66వ డివిజన్ అధ్యక్షుడు పాపిశెట్టి శ్రీధర్, బండి రజనీకుమార్ తదితరులు పాల్గొన్నారు.
