తెలంగాణకు ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేదు

తెలంగాణకు ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేదు

తెలంగాణకు కేంద్రం ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేదో బీజేపీ నేతలు సమాధానం చెప్పాలని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కామారెడ్డిలో పచ్చి అబద్దాలు మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మలా సీతారామన్ తెలుగువారి కోడలు-..అబద్ధాల మోడల్ లా వ్యవహరించారని మండిపడ్డారు. పసుపు బోర్డు తెస్తానని ఎంపీ అర్వింద్ జిల్లా ప్రజలను మోసం చేశారని తెలిపారు. కేంద్రంలో బీజేపీ వచ్చాక నిత్యావసర ధరలు అమాంతం పెరిగాయన్నారు. ఆసరా పింఛన్ సంబురాలు చూడలేక బిజెపి అబద్దాలు మాట్లాడుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాల్లో కేంద్రం వాటా ఎంతో చెప్పాలని నిలదీశారు. 

మంత్రి హరీష్ రావు విసిరిన రాజీనామా సవాల్ ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్వీకరించాలన్నారు. రాష్ట్ర ప్రజలు కారు, సారు, సర్కారుతో ఉన్నారన్నారు.రాష్ట్రంలో బీజేపీ మత విద్వేషాలు రెచ్చగొడుతుందని మండిపడ్డారు. జీఎస్టీ విధించే మోడీ కావాలో, అన్ని చేస్తున్న కేసీఆర్ కావాలో ప్రజలే నిర్ణయిస్తారన్నారు. రేపటి బీజేపీ సభ ఎందుకో జిల్లా బిజెపి నేతలు సమాధానం చెప్పాలన్నారు. ఈ నెల 5న జరిగే సీఎం  సభని బీజేపీ కార్యకర్తలు అడ్డుకునే యత్నం చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని జీవన్ రెడ్డి హెచ్చరించారు. 

ఉచితాలు ఇవ్వొద్దంటున్న బీజేపీ 

రాష్ట్రంలో బీజేపీ మత విద్వేషాలు రెచ్చగొడుతుందని ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా ఆరోపించారు. తెలంగాణ పర్యటనకు వచ్చిన  నిర్మలా సీతారామన్ కేంద్ర మంత్రిలా వ్యవహరించలేదని..బీజేపీ నేతలా అబద్దాలు మాట్లాడారని మండిపడ్డారు. పసుపు బోర్డు హామీ ఏమైందని ఎంపీ అర్వింద్ ను నిలదీశారు. బీజేపీ వల్లనే దేశం అప్పుల పాలవుతుందన్నారు. ఉచితాలు ఇవ్వొద్దని కమలదళం ఉచిత సలహాలు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్రానికి ఏం మేలు చేశారో బీజేపీ నేతలు సమాధానం చెప్పాలన్నారు.