- లిక్కర్ స్కామ్‌తో పరువు తీసింది
- అత్తగారి ఊర్లో కూడా గెలవలేక చతికిల పడింది
- కేసీఆర్ పేరు చెప్పుకొని ఓవర్ల్యాప్ల్యాండ్ క్లియర్ చేసుకున్నది
- ఆమె చరిత్ర బయటపెడితే తట్టుకోలేదు : ఎమ్మెల్యే మాధవరం
కూకట్‌పల్లి, వెలుగు : ఢిల్లీలో లిక్కర్ కేసుతో ఎమ్మెల్సీ కవిత రాష్ట్ర పరువు తీసిందని, కనీసం అత్తగారి ఊరిలో కూడా గెలవలేకపోయిన ఆమెకు మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిసిన తనను విమర్శించే నైతికత లేదని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. సోమవారం కూకట్‌పల్లి నియోజకవర్గంలో తెలంగాణ జాగృతి జనంబాటలో భాగంగా కవిత.. కృష్ణారావుపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన కబ్జాదారుడని కామెంట్ చేయగా.. కృష్ణారావు ఖండించారు. మంగళవారం ఎమ్మెల్యే మాట్లాడుతూ కవిత తన ఇంట్లో కుక్కకు కూడా విస్కీ అని పేరు పెట్టుకున్నారని, లిక్కర్‌స్కామ్‌తో చరిత్రహీనురాలిగా మిగిలిపోయారన్నారు.
తనపై ఇప్పటివరకూ ఎన్నో కుక్కలు మొరిగి పోయాయని కవితనుద్దేశించి అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి.. కేటీఆర్, హరీశ్‌ను జైలుకు పంపాలని కవిత చేస్తున్న కుట్రలు తమకు తెలుసని, ఆమె చరిత్ర బయటపెడితే తట్టుకోలేదని అన్నారు. ‘‘కేసీఆర్ పేరు చెప్పుకొని కూకట్‌పల్లిలో ఓవర్‌ల్యాప్ ల్యాండ్ క్లియర్ చేసుకున్నవ్.. నిత్యం దోచుకు తినాలనే ధ్యాస తప్ప ప్రజల గురించి ఆలోచించే ఉద్దేశం లేదు. పెద్దాయన మీద గౌరవంతో ఊరుకుంటున్నం. ఇకపై నాపై కానీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపైన కానీ అవాకులు, చవాకులు పేలితే సహించేది లేదు” అని హెచ్చరించారు. తన కార్యాలయంలో ఉన్న కవిత ఫ్లెక్సీని తొలగించారు.

