కేటీఆర్ నిరసన చూసి రగిలిపోతున్న నిరుద్యోగులు..ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఫైర్

కేటీఆర్ నిరసన చూసి రగిలిపోతున్న నిరుద్యోగులు..ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఫైర్

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ ధర్నా చౌక్‌‌లో కేటీఆర్ చేసిన నిరసనను చూసి తెలంగాణలోని నిరుద్యోగులు, యువత రగిలిపోతున్నారని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. శుక్రవారం సీఎల్పీలో ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో గ్రూప్-1 ప్రశ్నపత్రాలు పాన్ షాపుల్లో దొరికిన ఘోరమైన తీరును యువత, నిరుద్యోగులు గుర్తు చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు.

ఢిల్లీలో కొద్ది రోజులుగా విద్యార్థులు నిరసనలు చేస్తుంటే, ఇప్పుడు తీరిగ్గా కేటీఆర్ ధర్నా చేయడం ఆయనలోని చిత్తశుద్ధిని అనుమానించేలా ఉందన్నారు. కేటీఆర్ ధర్నా చూసిన వారంతా.. 'చంపినోడే సంతాప సభ పెట్టినట్లు ఉంది' అని విమర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు. కనీసం తన పుట్టినరోజు సందర్భంగానైనా పదేళ్లలో చేసిన తప్పులకు క్షమాపణలు చెప్పి, ధర్నా చౌక్‌‌లో ముక్కు నేలకు రాస్తే నిరుద్యోగులపై ఆయనకున్న చిత్తశుద్ధిని గుర్తించేవారన్నారు.