
- జడ్పీ మీటింగ్ లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి బూతు పురాణం
- చిగురుమామిడి జడ్పీటీసీ గీకురు రవీందర్ పై చిందులు
- వేదిక హాల్ లోనే ఉమ్మేసిన ఎమ్మెల్యే
కరీంనగర్, వెలుగు : కరీంనగర్ జడ్పీ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బూతు పురాణం అందుకున్నారు. తనను ప్రశ్నించిన చిగురుమామిడి జడ్పీటీసీ, కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ గీకురు రవీందర్‌పై చిందులు తొక్కారు. కరీంనగర్ డీఈవోను సస్పెండ్ చేయాలంటూ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ జడ్పీటీసీ సభ్యులు అరగంట నిరసన తెలిపారు. దీంతో కలెక్టర్ సమావేశం నుంచి వెళ్లిపోయారు.
ఆ టైంలో జడ్పీటీసీ గీకురు రవీందర్ లేచి ‘మీరు అధికారంలో ఉన్నప్పుడు హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విషయంలో ప్రొటోకాల్ పాటించాలనే విషయం తెలియదా’ అని ప్రశ్నించారు. దీంతో కౌ శిక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ 'అమ్ముడుపోయిన నువ్వు కూడా మాట్లాడేటోనివి అయినవా సిగ్గుండాలే.. తూ నీదో బతుకారా.. తూ.. తూ.. తూ అని’ బూతులు తిడుతూ వేదిక హాల్ లోనే ఉమ్మేశారు.
‘ఏం తమాషా చేస్తున్నావా? ఏందిరోయ్..మంచిగుండదు..నీ సంగతి చెప్తా. ఎటు పోతవు బిడ్డ. ఎక్కువ రోజులు ఉండవు. నీ సంగతి చెప్తా.. పొన్నం ప్రభాకర్ అండ చూసుకుని మాట్లాడుతున్నవా..ఏం పీకలేవు. నా ఎంటికతో బరాబార్ పో’ అంటూ మధ్యమధ్యలో బూతులు వదిలారు. దీంతో రవీందర్ కూడా అదే స్థాయిలో ఫైర్ అయ్యారు. చస్తానని బ్లాక్ మెయిల్ చేసి గెలిచావు అని విమర్శించారు.
‘ఉద్యమకారుల మీద రాళ్లేసినవాడివి నువ్వా మాట్లాడేది. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ కు అమ్ముడు పోయింది నువ్వు’ అంటూ విమర్శించారు. ఎమ్మెల్యే మాటలు విని మహిళా సభ్యులు కూడా తలదించుకోవడం కనిపించింది.