పద్మారావునగర్, వెలుగు: నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఓయూ నిరుద్యోగ జేఏసీ నేత మోతీలాల్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష సోమవారం(8వ రోజు) కొనసాగింది. గాంధీ హాస్పిటల్లో దీక్ష చేస్తున్నారు. ఆయనకు మద్దతు తెలిపేందుకు సోమవారం పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు, స్టూడెంట్లు వస్తున్నారని తెలిసి పోలీసులు హాస్పిటల్బయట భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈస్ట్ జోన్ డీసీపీ గిరిధర్ఆధ్వర్యంలో ఆందోళనకు దిగిన యువతను, బీఆర్ఎస్ నాయకులను అడ్డుకొని బొల్లారం పీఎస్‌కు తరలించారు.
మోతీలాల్‌ను పరామర్శించేందుకు వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు, నిరుద్యోగ సమాఖ్య గౌరవ అధ్యక్షుడు డి.రాజారాం యాదవ్ ను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, రాజారాం యాదవ్ పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. పోలీసులు వారిని అరెస్ట్‌చేశారు.
ఎన్నికల ముందు హామీలు గుప్పించిన కోదండరాం, బల్మూరి వెంకట్, ఆకూనూరి మురళి, రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ఎక్కడ అని ప్రశ్నించారు. కాగా మోతీలాల్‌నాయక్ ‘వెలుగు’ ప్రతినిధితో మాట్లాడుతూ తాను ఎట్టిపరిస్థితుల్లో దీక్ష విరమించేంది లేదని చెప్పారు. లక్షలాది మంది నిరుద్యోగుల కోసం దీక్ష చేస్తున్నానని, హామీలను నెరవేర్చాలని కోరారు.
