ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం.. ఆస్తులు అమ్ముకునేందుకే

ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం.. ఆస్తులు అమ్ముకునేందుకే

హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని స్టేట్ కేబినెట్​లో తీసుకున్న నిర్ణయం.. ఆ సంస్థ కార్మికులపై ప్రేమతో కాదని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. ఈ నిర్ణయం వెనుక కుట్ర దాగి ఉందని తెలిపారు. ఆర్టీసీకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విలువైన ఆస్తులు అమ్ముకునేందుకే అని ఫైర్ అయ్యారు. మంగళవారం బీజేపీ స్టేట్ ఆఫీస్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. వరద ప్రాంతాలను ఇంకా కేసీఆర్ సందర్శించలేదని, బాధితులను కూడా ఓదార్చలేదన్నారు. వారికి ఎలాంటి ఆర్థిక సాయం ప్రకటించకుండా.. రాజకీయాలు చేసేందుకు మహారాష్ట్రకు స్పెషల్ ఫ్లైట్​లో వెళ్లడం ఏంటని ప్రశ్నించారు. స్పెషల్ ఫ్లైట్​కు అయ్యే ఖర్చుతో భూపాలపల్లి జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతమైన మోరంచపల్లి బాధితులకు అన్నం పెట్టొచ్చన్నారు. 

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ ఒకనెల జీతాన్ని మోరంచ ప్రజలను ఆదుకునేందుకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రూ.5 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం.. కేసీఆర్ పర్యటనల కోసం ఒక కొత్త బస్సు కొనుగోలు చేసిందని, కానీ.. ఇప్పటి వరకు ఆయన ఆ బస్సే ఎక్కలేదన్నారు. కనీసం మంగళవారమైనా కేసీఆర్ ఆ బస్సులో మోరంచకు వెళ్లి వరద బాధితులను పరామర్శిస్తారని అనుకున్నా అని, కానీ.. మహారాష్ట్రకు వెళ్లారని మండిపడ్డారు. ఇది చాలా బాధాకరమన్నారు. ఇందుకోసమేనా కొట్లాడి తెలంగాణ సాధించుకున్నామా? అని నిలదీశారు.