బీజేపీలో బీసీలు ఎక్కడున్నారో చెప్తారా?..కేంద్రమంత్రి కిషన్‌‌‌‌రెడ్డికి ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రశ్న

బీజేపీలో బీసీలు ఎక్కడున్నారో చెప్తారా?..కేంద్రమంత్రి కిషన్‌‌‌‌రెడ్డికి ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రశ్న

హైదరాబాద్, వెలుగు: బీజేపీలో బీసీలు ఎక్కడున్నారో చెప్పాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎన్నికలు జరిగినప్పుడల్లా, బీజేపీ జాతీయ పెద్దలు రాష్ట్రానికి వచ్చినప్పుడల్లా బీసీ ముఖ్యమంత్రి అని చెప్తారని, చివరకు తెలంగాణలో అన్ని ఎన్నికల్లో బీసీలను మర్చిపోతారని బుధవారం ఒక ప్రకటనలో విమర్శించారు. తాను ఇంతకుముందు ఎప్పుడూ ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు, ఓబీసీల గురించి మాట్లాడలేదన్నారు. కేవలం హిందూత్వం గురించి మాత్రమే మాట్లాడుతానన్నారు. 

ఇప్పుడు ఈ అంశంపై మాట్లాడటానికి కిషన్‌‌‌‌రెడ్డే కారణమని తెలిపారు. ప్రతి ఎన్నికల్లో బీసీ కార్డు ప్లే చేసి బీసీ సమాజాన్ని మోసం చేస్తున్నారని మండిపడ్డారు. అందుకే తాను ఈ అంశంపై మాట్లాడాల్సి వస్తోందన్నారు. బీజేపీ నుంచి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నందుకు లంకల దీపక్ రెడ్డికి రాజాసింగ్ అభినందనలు తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న ఆశావహులంతా తమ పేరే వస్తుందని భావించారని.. కానీ, అలా జరగలేదన్నారు. పేరుకు హైకమాండ్ ప్రకటన చేసినా.. దీని వెనక ప్రధాన పాత్ర కిషన్ రెడ్డిదేనని చెప్పారు.