హోం మినిస్టర్ ని వెంటనే మార్చాలి.. ఛాన్సిస్తే మేమేంటో చూపిస్తాం: ఎమ్మెల్యే రాజాసింగ్

హోం మినిస్టర్ ని వెంటనే మార్చాలి.. ఛాన్సిస్తే మేమేంటో చూపిస్తాం: ఎమ్మెల్యే రాజాసింగ్

తెలంగాణలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైందని గోషామాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శించారు. తెలంగాణ గడ్డ మర్డర్లకు అడ్డంగా మారిందన్నారు. హత్యలకు అడ్డాగా తెలంగాణ మారిందని, రోజుకో హత్య, దోపిడీ జరుగుతోందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే హత్యలు చేస్తారా..? అని ప్రశ్నించారు. అసలు ఏం జరుగుతోంది తెలంగాణలో అని నిలదీశారు. 

సీఎం కేసీఆర్ వెంటనే హోమ్ మంత్రి పదవి నుంచి మహమూద్ అలీని మార్చాలని డిమాండ్ చేశారు. తమ మిత్రులు హత్యలు చేస్తుంటే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అనుమానాలు వ్యక్తం చేశారు. ఒకవేళ లా అండ్ ఆర్డర్ ఎలా కంట్రోల్ చేయాలో తెలియకపోతే, తమకు ఛాన్స్ ఇస్తే హత్యలు చేసే వారికి పనిష్మెంట్ ఎలా ఉండాలో రౌడీలకు తాము చూపిస్తాం అన్నారు. 

రాహుల్ సింగ్ అనే 23, 24 ఏళ్ల వయసు ఉన్న యువకుడ్ని దారుణంగా హత్య చేశారని రాజా సింగ్ ఆరోపించారు. అత్తాపూర్ లో జిమ్ కు వెళ్లి వస్తున్న అతడిపై నలుగురు వ్యక్తులు పెప్పర్ స్పే కొట్టి, కళ్లల్లో కారం చల్లి కత్తులతో దాడి చేసి హత్య చేశారని చెప్పారు. రాహుల్ సింగ్ హత్య జరిగి 3 రోజులు గడిచినా అరెస్టులపై ఎలాంటి సమాచారం లేదన్నారు. ఎందుకు హత్య చేశారు, నిందితులు ఎవరు అనే వివరాలను పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారని రాజా సింగ్ ఆరోపించారు. 

తక్షణమే హోం మినిస్టర్ ను మార్చాలని, యాక్టివ్ వ్యక్తిని హోం మినిస్టర్ గా చేయాలని సీఎం కేసీఆర్ ను డిమాండ్ చేశారు. ఇలా చేయలేని పక్షంలో తమకు బాధ్యతలు అప్పగిస్తే హత్యలు చేసే రౌడీలకు ఎలాంటి శిక్షలు వేయాలో చేసి చూపిస్తామంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టి నిజాలు బహిర్గతం చేయాలని పోలీసులను రిక్వెస్ట్ చేశారు. ఈ హత్య కేసులో ఎంతమంది ఇన్వాల్స్ అయ్యారో పోలీసులు అందర్నీ అరెస్ట్ చేసి శిక్షించాలని రాజా సింగ్ కోరారు.