- అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ
- ఎంత పెంచితే .. ఎన్ని నిధులు అవసరమో లెక్కలు తీస్తున్న ఆర్థిక శాఖ
- రాష్ట్రంలో వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ సహా మొత్తం పెన్షన్‌దారులు 44 లక్షలు
- లబ్ధిదారుల సంఖ్య, ఇచ్చిన హామీ ప్రకారం అన్ని పింఛన్లు
- పెంచితే దాదాపు రూ. 22 వేల కోట్లు అవసరం
- ఈ మొత్తాన్ని బడ్జెట్‌లో సర్దడంపై అధికారుల కసరత్తు
- అదనపు నిధుల సమీకరణకు ఉన్న మార్గాలపై అన్వేషణ
- ఏకకాలంలో పెంపు సాధ్యం కాకపోతే.. దశలవారీగానైనా పెంచే ప్రయత్నం
హైదరాబాద్, వెలుగు: ఆరు గ్యారంటీల్లో ఒకటైన పింఛన్ల పెంపును త్వరలోనే అమలులోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. వృద్ధాప్య, వితంతు, ఇతర సామాజిక భద్రత పింఛన్లను పెంచేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను బేరీజు వేసుకుంటూ.. వచ్చే ఆర్థిక సంవత్సరం (2026–-27) ఆరంభం నుంచే, అంటే ఏప్రిల్ నుంచే పింఛన్ల పెంపును అమలులోకి తేవాలని కార్యాచరణ రూపొందిస్తున్నారు. పెంపుతో రాష్ట్ర ఖజానాపై పడే భారంపై ఆర్థిక శాఖ ఆఫీసర్లు స్టడీ చేస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-–26) బడ్జెట్‌లో పింఛన్ల కోసం ప్రభుత్వం సుమారు రూ. 11,635 కోట్లు కేటాయించింది. ఇప్పుడున్న లబ్ధిదారుల సంఖ్య, ఇచ్చిన హామీ ప్రకారం అన్ని పింఛన్లు పెంచితే.. దాదాపు రూ. 22 వేల కోట్ల వరకు చేరే అవకాశం ఉంటుందని ఓ ప్రాథమిక అంచనా. ఇంత భారీ మొత్తాన్ని బడ్జెట్‌లో ఎలా సర్దుబాటు చేయాలి? అదనపు నిధుల సమీకరణకు ఉన్న మార్గాలేమిటి? అనే అంశాలపై ఆర్థిక శాఖ అన్వేషిస్తున్నది. పెన్షనన్లు ఇప్పుడు ఇస్తున్న దానికి రూ. 500 పెంచడమా లేదా రూ. 1,000 పెంచడమా? అనే దానిపై అధికారులు లెక్కలు వేస్తున్నారు. ఏకకాలంలో పెంచడం సాధ్యం కానీ పరిస్థితుల్లో దశలవారీగా పెంచాలని చూస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న పింఛన్ల విధానాన్ని పరిశీలిస్తే.. వివిధ వర్గాలకు వేర్వేరు మొత్తాలు అందుతున్నాయి. వృద్ధులు, వితంతువులు, నేతన్నలు, గీత కార్మికులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, ఎయిడ్స్ బాధితులకు నెలకు రూ. 2,016 చొప్పున ప్రభుత్వం ఇస్తున్నది. దివ్యాంగులకు రూ. 4,016 చొప్పున చెల్లిస్తున్నది. డయాలసిస్ రోగులు, ఇతర దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు రూ. 5 వేల నుంచి 10 వేల వరకు పింఛను అందుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు సాధారణ పింఛన్‌ను రూ. 4,000కు, దివ్యాంగుల పింఛన్‌ను రూ. 6,000కు పెంచాల్సి ఉంది. చేయూత గ్యారంటీ కింద.. పింఛన్ల పెంపు, రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా పెంపును ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రకటించింది. ఇప్పటికే ఆరోగ్యశ్రీ బీమా పెంపును అమలు చేస్తున్నది. ఇప్పుడు పింఛన్ల పెంపుపై ఫోకస్ పెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం సుమారు 44 లక్షల మందికి పైగా పింఛనుదారులు ఉన్నారు.
కొత్తవాళ్ల నుంచి దరఖాస్తులు!
ఆధార్ సీడింగ్, బయోమెట్రిక్ విధానాలను పకడ్బందీగా చేయడం ద్వారా బోగస్ పింఛన్లకు అడ్డుకట్ట వేయొచ్చని, తద్వారా ఆదా అయిన నిధులను పెంపునకు వినియోగించుకోవచ్చని ప్రభుత్వం యోచిస్తున్నది. వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచే అమలు చేయాలన్న ఆలోచన ఉన్న ప్రభుత్వం.. ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నది. అదే సమయంలో ఇటీవల కొత్త రేషన్ కార్డులు ఇచ్చిన నేపథ్యంలో కొత్తగా పింఛన్‌కు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు తీసుకోనున్నారు. పెరిగిన నిత్యావసరాల ధరలు, వైద్య ఖర్చుల దృష్ట్యా పింఛను పెంచాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
