బెంగళూరు: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్. ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ అయిన ఎం.చిన్నస్వామి స్టేడియంలో ఈ సీజన్ ఐపీఎల్ నిర్వహణ విషయంలో సస్పెన్స్‌కు ఎట్టకేలకు తెరపడింది. చిన్నస్వామిలో మ్యాచ్‌లు ఆడేందుకు కర్నాటక ప్రభుత్వం సోమవారం అధికారిక అనుమతి ఇచ్చింది. గతేడాది ఆర్సీబీ విజయోత్సవాల్లో జరిగిన తొక్కిసలాట ఘటన నేపథ్యంలో నెలకొన్న అనిశ్చితికి తెరపడింది. ఈ నెల 28న ప్రారంభం కానున్న ఐపీఎల్ 19వ ఎడిషన్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంప్ ఆర్సీబీ సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనున్నాయి.
రాష్ట్ర హోం మంత్రి పరమేశ్వర్ నేతృత్వంలో నిపుణుల కమిటీ, కర్నాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (కేఎస్‌సీఏ), ఆర్సీబీ ప్రతినిధులతో జరిగిన సమావేశం అనంతరం ఈ క్లియరెన్స్ లభించింది. స్టేడియంలో భద్రతా ప్రమాణాలు, ఏర్పాట్లపై నిపుణుల కమిటీ సమర్పించిన నివేదికను ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలించి మ్యాచ్‌ల నిర్వహణకు అనుమతి మంజూరు చేసింది.
కాగా, గతేడాది జూన్ 4న ఆర్సీబీ ఐపీఎల్ విజయోత్సవ వేడుకల సందర్భంగా ఈ స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 30 మందికి పైగా గాయపడ్డారు. ఈ విషాదంపై జరిగిన న్యాయ విచారణలో ఆర్సీబీ ఫ్రాంచైజీ, కేఎస్సీఏ, ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థ డీఎన్ఏ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని తేలింది. దీంతో అంతర్జాతీయ స్థాయి భద్రతా ప్రమాణాలు కల్పించే వరకు స్టేడియంలో ప్రేక్షకులతో కూడిన క్రీడా ఈవెంట్లపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది.
ప్రస్తుతం అన్ని భద్రతా చర్యలు పూర్తి కావడంతో స్టేడియం వేదికగా మ్యాచ్‌ల నిర్వహణకు మార్గం సుగమమైంది. ఈ సీజన్‌లో ఆర్సీబీ తన ఏడు హోమ్ మ్యాచ్‌లలో ఐదు బెంగళూరులో ఆడనుంది. మిగిలిన రెండు మ్యాచ్‌లు రాయ్‌పూర్ లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతాయి. ఐపీఎల్ ఓపెనింగ్ సెర్మనీ, ఫైనల్, ఆర్సీబీ అన్‌బాక్సింగ్ ఈవెంట్ కూడా చిన్నస్వామి స్టేడియం వేదికగానే నిర్వహించనున్నారు.
