ఆ సమయం ఇప్పుడు వచ్చింది: లెజెండరీ బ్యాటర్ మిథాలీ రాజ్

ఆ సమయం ఇప్పుడు వచ్చింది: లెజెండరీ బ్యాటర్ మిథాలీ రాజ్

న్యూఢిల్లీ: ప్రపంచ వేదికపై ఇండియా క్రికెట్ టీమ్స్ తిరుగులేని ఆధిపత్యం చెలాయించాలనే తన కల నెరవేరుతోందని లెజెండరీ బ్యాటర్ మిథాలీ రాజ్ ఆనందం వ్యక్తం చేసింది. ఆదివారం  రాత్రి జరిగిన బీసీసీఐ వార్షిక నమన్ అవార్డుల వేడుకలో రాహుల్ ద్రవిడ్, రోజర్ బిన్నీతో కలిసి లైఫ్ టైమ్ అచీవ్‌‌‌‌మెంట్ పురస్కారం అందుకున్న మిథాలీ  ఇండియన్ క్రికెట్ సాధిస్తున్న విజయాలపై మాట్లాడింది. 

గత రెండేండ్లలో మెన్స్, విమెన్స్, జూనియర్ జట్లు ప్రపంచ స్థాయిలో అద్భుత పెర్ఫామెన్స్ చేస్తున్నాయని కొనియాడింది. ‘ఇండియా క్రికెట్ ప్రపంచాన్ని శాసించాలని చాలా కాలంగా కోరుకున్నాను, ఆ సమయం ఇప్పుడు వచ్చింది’ అని మిథాలీ పేర్కొంది. 

అమ్మాయిల క్రికెట్ అభివృద్ధిలో ఐసీసీ చీఫ్ జై షా పాత్రను మిథాలీ ప్రత్యేకంగా ప్రశంసించింది. ఆయన కృషి, ముందుచూపు వల్లే దేశంలో మహిళా క్రికెట్ రూపురేఖలు మారాయని, ముఖ్యంగా అబ్బాయిలతో సమానంగా మ్యాచ్ ఫీజు కల్పించడం, విమెన్స్ ప్రీమియర్ లీగ్ ప్రారంభించడం వంటి చర్యలు ఆటను మరో స్థాయికి తీసుకెళ్లాయని చెప్పింది. ఇక తన కెరీర్‌‌‌‌లో సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ ఎంతో ప్రభావితం చేశారని మిథాలీ వెల్లడించింది.