- రోగులను కాపాడుతూ 11 మంది స్టాఫ్కు గాయాలు
- ఒడిశాలోని కటక్ హాస్పిటల్ లో ఘోరం
- ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని, సీఎం దిగ్ర్భాంతి
- విచారణకు ఆదేశించిన ముఖ్యమంత్రి మాఝీ
- మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం
భువనేశ్వర్: ఒడిశాలోని కటక్ లో ఘోరం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వరంలో నడిచే ఎస్ సీబీ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ లో సోమవారం తెల్లవారుజామున 2.30 గంటలకు భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 10 మంది పేషెంట్లు చనిపోయారు. మిగతా పేషెంట్లను కాపాడే క్రమంలో 11 మంది స్టాఫ్ మెంబర్లు గాయపడ్డారు. ప్రమాదం జరిగిన 20 నిమిషాలకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు.
ట్రామా కేర్ ఐసీయూ, పక్కన ఉన్న మరో ఐసీయూతో పాటు ఓ వార్డులో 23 మంది రోగులు ఉండగా.. వారిలో ఏడుగురు స్పాట్ లోనే చనిపోయారు. మరో ముగ్గురిని ఐసీయూ నుంచి తరలిస్తుండగా కాలిన గాయాలతో ప్రాణాలు కోల్పోయారు. వివిధ ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారికి ట్రీట్ మెంట్ ఇచ్చే ట్రామా కేర్ ప్రాంతంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని ఇదే హాస్పిటల్ లోనే వేరే డిపార్ట్ మెంట్లకు షిఫ్ట్ చేశారు.
కాగా.. ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, ప్రధాని నరేంద్ర మోదీ ‘ఎక్స్’ లో దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. చనిపోయిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున పరిహారాన్ని ప్రధాని ప్రకటించారు. చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. సీఎం మోహన్ చరణ్ మాఝీకి మోదీ ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే రాష్ట్ర గవర్నర్ హెచ్ బీ కంభంపాటి, కేంద్ర మంత్రి ధర్మేంద ప్రధాన్, ప్రతిపక్ష నేత నవీన్ పట్నాయక్ కూడా ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఆసుపత్రిని సందర్శించిన సీఎం మాఝీ
అగ్నిప్రమాదం జరిగిన తర్వాత ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్మాఝీ.. హెల్త్ మినిస్టర్ ముకేశ్ మహాలింగ్ తో కలిసి ఆసుపత్రిని సందర్శించారు. ఘటనపై స్టాఫ్ ను అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ ప్రమాదానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఘటనపై విచారణకు ఒక కమిటీ వేశామని తెలిపారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగి ఉండవచ్చని సీఎం పేర్కొన్నారు.
ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని సీఎం ప్రకటించారు. 11 మంది మెడికల్ అధికారులు తమ ప్రాణాలను పణంగా పెట్టి రోగులను కాపాడుతూ గాయపడ్డారని చెప్పారు. ప్రస్తుతం వారికి ఇదే హాస్పిటల్ లోని ఓ వార్డులో ట్రీట్ మెంట్ ఇప్పిస్తున్నామని వెల్లడించారు. ఇక ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఆసుపత్రుల్లో అగ్నిప్రమాదాల నివారణకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
