రవ్వంత రెడ్డి నువ్వు నాకన్నా ఎంత పెద్దగా ఉన్నావ్ : ఎమ్మెల్యే రసమయి

రవ్వంత రెడ్డి నువ్వు నాకన్నా ఎంత పెద్దగా ఉన్నావ్ : ఎమ్మెల్యే రసమయి

రేవంత్ రెడ్డి, కవ్వంపల్లి సత్యనారాయణ ఉద్యమ సమయంలో చంద్రబాబు బూట్లు మోశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆరోపించారు. ఉద్యమకారులను గన్నులతో బెదిరించిన చంద్రబాబుకు వీరిద్దరు తొత్తులుగా వ్యవహరించారని మండిపడ్డారు. మానకొండూరులో తనపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు రసమయి బాలకిషన్ కౌంటర్ వేశారు. రేవంత్ రెడ్డి తన కంటే పెద్దగా ఉన్నడా అని ఎద్దేవా చేశారు. దళితులు అంటే రేవంత్ రెడ్డికి చిన్నచూపని.. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల కూడా వేయలేదని విమర్శించారు.  ఉద్యమ సమయంలో సీఎం కేసీఆర్ జెండా పట్టినప్పుడు ఎందుకు పారిపోయావ్ అని రేవంత్ ను నిలదీశారు. నియోజకవర్గంలోని మొగిలిపాలెంలో ప్రజలెవ్వరు  రేవంత్ మొఖం చూడలేదన్నారు.

తనపై ఆరోపణలు చేస్తున్న డీసీసీ అధ్యక్షుని పేరు  కవ్వంపల్లి సత్యనారాయణ కాదు..ఆయన కామంపల్లి సత్యనారాయణ అని చురకలంటించారు. కవ్వంపల్లి  నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. కవ్వంపల్లి సత్యనారాయణ గ్రామ సర్పంచ్ గా గెలిచే పరిస్థితి కూడా లేదన్నారు. రాబోయే రోజుల్లో కవ్వంపల్లి కాంగ్రెస్ పార్టీలో ఉండడని జోస్యం చెప్పారు. 

సీఎం కేసీఆర్ కుటుంబాన్ని, మమ్మల్ని తిట్టుడు కాదు ప్రజలకు ఎం చేస్తావో చెప్పు రవ్వంత రెడ్డి అని రసమయి ప్రశ్నించారు. వైద్యం పేరుతో పేద ప్రజల కడుపులు చీరి కోట్లకు కోట్లు సంపాదించిన వ్యక్తి కవ్వంపల్లి అని ఆరోపించారు. చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరినట్లు అటు రేవంత్ రెడ్డి,కవ్వంపల్లి కాంగ్రెస్ పార్టీలో సొచ్చిర్రని విమర్శించారు. పాదయాత్రలో రేవంత్ కాన్వాయ్ వృద్ధునికి తగిలి గాయాలతో కింద పడిపోతే కనీసం ఆగకుండా వెళ్ళిపోవడం సిగ్గుచేటని ఎమ్మెల్యే రసమయి ఆగ్రహం వ్యక్తం చేశారు.