జగిత్యాల రూరల్, వెలుగు: బొర్నపల్లి–జగన్నాథ్‌పూర్ బ్రిడ్జి నిర్మాణం విషయంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మండిపడ్డారు. సోమవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ.. బ్రిడ్జి నిర్మాణం కోసం ఇటీవల తాను సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌ను కలిసి వినతిపత్రం ఇవ్వడాన్ని జీవన్ రెడ్డి తప్పుబట్టడం విడ్డూరంగా ఉందన్నారు. గతంలో కేంద్ర మంత్రి జువెల్ ఓరంకు ఎంపీ అరవింద్‌తో కలిసి వినతిపత్రం ఇచ్చానని, నిధుల కోసం సీఎం రేవంత్ రెడ్డి ద్వారా కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్లు గుర్తుచేశారు.
టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్లు పనిచేయకపోవడంతో రీ-టెండరింగ్ నిర్వహించి, పనులను త్వరగా పూర్తి చేయాలని కోరడానికే తాను మంత్రిని కలిశానని స్పష్టం చేశారు. 2012లోనే బ్రిడ్జికి రూ.1కోటి మంజూరయ్యాయని చెప్పిన జీవన్ రెడ్డి.. ఆ నిధులు ఏమయ్యాయో సమాధానం చెప్పాలన్నారు. గతంలో రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా ఉన్న ఆయన ఈ బ్రిడ్జిలను ఎందుకు పూర్తిచేయలేదని ప్రశ్నించారు. సమావేశంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నందయ్య, మున్సిపల్ చైర్‌పర్సన్ వాణి, బండ శంకర్, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
రైతులు ఆరుతడి పంటల వైపు మొగ్గు చూపాలి
రైతులు ఆరుతడి పంటల వైపు రైతులు మొగ్గు చూపాలని ఎమ్మెల్యే సంజయ్ సూచించారు. జగిత్యాల రూరల్ మండలం పొలాస రైతు వేదికలో ఏర్పాటు చేసిన విత్తన మేళాలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఎల్ నివో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు ఉన్నాయని, రైతులు సాగునీటిని పొదుపుగా వాడాలని.. ఆరుతడి పంటలు కంది,పెసర మినుము, మొక్క జొన్న, బంతి, కాయగూరలు పండించాలని సూచించారు.
