ములుగు జిల్లా: పేదలపై తనకున్న మమకారాన్ని మరోసారి చాటిచెప్పారు ఎమ్మెల్యే సీతక్క. వరద ముంపు బాధితులకు సాయం అందించేందుకు బయలుదేరిన ఆమె.. రోడ్డు మార్గం లేకపోవడంతో పడవలో వెళ్లి స్వయంగా దుప్పట్లను తలపై పెట్టుకొని తీసుకెళ్లారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం ఎలిశెట్టిపల్లి, ఓడవాడ, ఆచార్య నగర్, నందమూరి నగర్ తదితర ప్రాంతాలు ఇటీవల వరద ముంపునకు గురయ్యాయి. ఈ మేరకు రాబిన్ ఉడ్ ఆర్మీ బాధ్యులు రమ – దామోదర్ ఆధ్వర్యాన ఆయా ప్రాంతాల్లో బాధితులకు మంగళవారం చీరలు, దుప్పట్లు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న సీతక్క.. ఎలిశెట్టిపల్లికి వెళ్లే క్రమంలో రోడ్డు మార్గం లేకపోవడంతో పడవపై జంపన్న వాగు దాటారు. అక్కడ దిగాక కొద్దిదూరం నడవాల్సి ఉండటంతో ఇతరులతో కలసి సీతక్క స్వయంగా దుప్పట్లను మోశారు. అనంతరం బాధితులకు సరుకులు పంపిణీ చేసి ధైర్యం చెప్పారు.

