కంటోన్మెంట్ను విలీనం చేయాల్సిందే : ఎమ్మెల్యే శ్రీగణేశ్

కంటోన్మెంట్ను విలీనం చేయాల్సిందే : ఎమ్మెల్యే శ్రీగణేశ్
  • ఎమ్మెల్యే శ్రీగణేశ్ డిమాండ్
  • రేపట్నుంచి నిరవధిక రిలే నిరాహార దీక్షలు

పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డును జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని ఎమ్మెల్యే శ్రీగణేశ్ డిమాండ్ చేశారు. ఇందుకోసం మంగళవారం నుంచి కార్ఖానాలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరవధిక రిలే నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఆదివారం పికెట్​లోని తన క్యాంపు ఆఫీస్​లో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కంటోన్మెంట్ బోర్డులోని నామినేటెడ్ సభ్యుల పదవీకాలాన్ని మరోసారి పొడిగిస్తూ నోటిఫికేషన్ జారీ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. 2020 నుంచి ఎన్నికలు నిర్వహించకుండా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ పాలనను అస్తవ్యస్తం చేస్తున్న కేంద్రం వైఖరి గర్హనీయమని విమర్శించారు.

నగరం నడిబొడ్డున ఉన్న కంటోన్మెంట్ నియోజకవర్గం రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోకి వస్తే అభివృద్ధిలో వేగం పెరుగుతుందన్నారు. అధిక పన్నుల భారం తగ్గుతుందని, మౌలిక వసతుల అభివృద్ధి మరింత మెరుగవుతుందని చెప్పారు. స్థానిక ఎన్నికలు జరగకపోవడంతో వార్డు సభ్యులు లేక పాలన కుంటుపడుతోందని, ప్రజల సమస్యలకు పరిష్కారం లభించడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా నియోజకవర్గ ప్రజల పక్షాన ఈ పోరాటాన్ని ప్రారంభిస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి కంటోన్మెంట్ బోర్డు విలీనం చేసే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. అవసరమైతే రిలే నిరాహార దీక్షలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు.