నర్సాపూర్, వెలుగు: పార్టీలకతీతంగా నర్సాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే సునీతా రెడ్డి కోరారు. సోమవారం నర్సాపూర్ మున్సిపల్ పాలకవర్గ సమావేశం ఏర్పాటు చేయగా నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్మన్ లక్ష్మీ రాజు యాదవ్, వైస్ చైర్మన్ బుచ్చేశ్ యాదవ్, కౌన్సిలర్లను ఎమ్మెల్యే పూలమాల శాలువాలతో సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ పార్టీలను పక్కనపెట్టి మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించుకోవాలన్నారు. తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రామ్ చరణ్ రెడ్డి, మేనేజర్ మధుసూదన్, కౌన్సిలర్లు శ్రీకాంత్, రాజు, లలిత, సరళ, సునీత, మోయిజ్, ఆఫ్రిన్ పాల్గొన్నారు.
సీసీ రోడ్ల పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే
శివ్వంపేట: మండలంలోని గోమారం గ్రామంలో రూ.30 లక్షలవిలువైన సీసీ రోడ్ల పనులను ఎమ్మెల్యే సునీతా రెడ్డి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ఓటమిపాలైనా గ్రామాన్ని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం అభివృద్ధి చేస్తామన్నారు. అనంతరం గ్రామానికి చెందిన బండ శ్రీశైలం బైక్ దగ్ధమవడంతో పరిశీలించిన ఎమ్మెల్యే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ చంద్ర గౌడ్, నాయకులు హనుమంత్ రెడ్డి, లక్ష్మణ్, భిక్షపతి రెడ్డి, గోపి, అశోక్ రెడ్డి, జనార్దన్ గౌడ్ పాల్గొన్నారు.
