హైదరాబాద్, వెలుగు: పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను పిటిషనర్ల తరపు అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. శనివారం అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయంలో ఈ క్రాస్ ఎగ్జామినేషన్ జరిగింది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సమక్షంలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్ ను, మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ ని పిటిషనర్లు అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జగదీశ్ రెడ్డి, కేపీ వివేకానంద ల అడ్వకేట్లు విచారించారు.
బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరినట్టు ఉన్న పలు ఆధారాలను స్పీకర్ కు అందజేస్తూ ఆ ఇద్దరిని విచారించారు. అయితే, బీఆర్ఎస్ లోనే తాము కొనసాగుతున్నామని, కేవలం తమ నియోజకవర్గ అభివృద్ధి కోసం మాత్రమే సీఎం రేవంత్ రెడ్డిని కలిశామని తెల్లం వెంకట్రావ్, డా. సంజయ్ వాదించారు.
ఈ ఇద్దరి విచారణ ప్రస్తుతానికి పూర్తయినట్టు స్పీకర్ ప్రకటించారు. దీంతో ఇప్పటి వరకు ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న పది మందిలో ఎనిమిది మంది ఎమ్మెల్యేల విచారణ పూర్తయింది. ఇక మిగిలిన ఇద్దరిలో దానం నాగేందర్, కడియం శ్రీహరి ఇప్పటి వరకు స్పీకర్ నోటీసులకు స్పందించలేదు. దీంతో వారిద్దరిపై ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారో చూడాల్సిందే.
