
- హాజరుకానున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు
- రాజ్యసభ అభ్యర్థి అభిషేక్ సింఘ్వీని పరిచయం చేయనున్న సీఎం రేవంత్
హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఆదివారం కాంగ్రెస్ శాసన సభా పక్ష (సీఎల్పీ) సమావేశం జరగనుంది. సాయంత్రం ఏడు గంటలకు హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నానక్ రామ్ గూడలోని హోటల్ షెర్టాన్ లో జరగనున్న ఈ సమావేశానికి తెలంగాణ కోటా నుంచి కాంగ్రెస్ తరపున రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించిన అభిషేక్ మను సింఘ్వీ హాజరుకానున్నారు. ఆయనతో పాటు రాష్ట్రానికి చెందిన 74 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, 10 మంది ఆ పార్టీ ఎంపీలు, 14 మంది ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు.
ఈ సమావేశంలో అభిషేక్ మను సింఘ్వీని సీఎం రేవంత్ సభ్యులకు పరిచయం చేయనున్నారు. మీటింగ్ లో రాజ్యసభ అభ్యర్థిగా సింఘ్వీకి ఏకగ్రీవంగా మద్దతు తెలుపుతూ ఏకవాక్య తీర్మానం చేయనున్నారు. సమావేశంలో రాష్ట్రంలో త్వరలో జరగనున్న లోకల్ బాడీ ఎన్నికలపై కూడా చర్చించనున్నారు.
అలాగే తాజా రాజకీయ పరిస్థితులపై చర్చ సాగనుంది. రాజ్యసభ ఎన్నికల నామినేషన్లకు గడువు ఈ నెల 21 వరకు ఉండగా, పోలింగ్ వచ్చే నెల 3 న జరగనుంది. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. రాత్రిలోగా ఫలితం వెలువడనుంది. ఇతర రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను బరిలో నిలపని పక్షంలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఎన్నికలు జరిగినా ఈ సీటు కాంగ్రెస్ గెలుచుకోవడం ఖాయంగానే కనిపిస్తున్నది.