- సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ విజ్ఞప్తి
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ పార్టీ సొంత పత్రిక కాంగ్రెస్ వ్యతిరేక వార్తలు రాయడమే పనిగా పెట్టుకుందని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ పేర్కొన్నారు. బుధవారం సీఎల్పీలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘‘బీఆర్ఎస్కు ఓ సొంత పత్రిక ఉంది. కనీస జర్నలిజం విలువలను పాటించకుండా, ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం స్క్రిప్ట్ రైటర్స్ ను పెట్టుకొని తప్పుడు వార్తలు వండి వడ్డిస్తోంది’’ అని ఆయన ఫైర్అయ్యారు.
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. సీఎం రేవంత్ రెడ్డిపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు, ఆయన అనని మాటలను అన్నట్లు బీఆర్ఎస్ మీడియాలో రాయించారన్నారు. క్రమశిక్షణతో పనిచేసే నిజాయితీపరుడైన ఖర్గే వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా వార్త రాశారని మండిపడ్డారు. వెంటనే దీనిపై క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నాయకులు ముసుగు దొంగల్లా కాంగ్రెస్ పై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని, తప్పుడు వార్తలు రాస్తున్న ఇలాంటి మీడియా విషయంలో కఠినంగా వ్యవహరించాలని సీఎం రేవంత్ రెడ్డికి అద్దంకి దయాకర్ విజ్ఞప్తి చేశారు.
