రైతులపై పెట్టిన కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలి

రైతులపై పెట్టిన కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలి

తెలంగాణ కోరుకున్నది కేవలం టీఆర్​ఎస్​ శ్రేణుల కోసమేనా ? నిర్బంధాలతో పౌర స్వేచ్ఛను అణచివేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వెల్లడించారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటు పాలనా సౌలభ్యం కొరకే అని భావించినప్పటికి.. ఏ మంత్రికీ తమ శాఖలపై నిర్ణయాధికారం లేకుండా పోయిందన్నారు. టీఆర్ఎస్ దీక్షకు టెంట్లు, కూలర్లు, కుర్చీలు వేసి రక్షణ కల్పించిన పోలీసులు...రైతుకు మాత్రం కనీసం నిరసన తెలిపే స్వేచ్ఛను ఇవ్వడం లేదని విమర్శించారు. జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండల కేంద్రంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. రైతులపై పెట్టిన కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పోలీసుల అత్యుత్సాహంతోనే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతున్నట్లు ఆరోపించారు. షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని మంత్రి కేటీఆర్ కు విన్నవించేందుకు రైతులు వెళ్లాలని భావిస్తే అరెస్ట్ చేయడం దుర్మార్గమన్నారు.

ఏడేళ్ల లోపు శిక్ష కలిగిన కేసులకు స్టేషన్ బెయిల్ మంజూరు చెయ్యొచ్చని, కోర్టు మొట్టికాయలు వేస్తె బెయిల్ పై రైతు నాయకులను విడుదల చేయడం జరిగిందని వివరించారు. ఇటీవలే మంత్రి నిరంజన్ రెడ్డి పర్యటనలో రుణమాఫీ, రైతు బంధు, విత్తన రాయితీపై ఎలాంటి ప్రకటన చేయలేదని, విత్తనాలకు అందించేందుకు ప్రభుత్వం నేటికీ చర్యలు చేపట్టలేదని తెలిపారు. వానాకాలం పంట సీజన్ మొదలై రెండు వారాలు గడుస్తున్నా వ్యవసాయ విధి విధానాలను ప్రకటించకపోవడం శోచనీయమన్నారు. గతంలో ఇలాంటి పరిస్థితి ఎన్నడూ లేదని గుర్తు చేశారాయన. జూన్ మొదటి వారంలో అందాల్సిన రైతు బంధు రాకపోవడం, రైతు రుణమాఫీ జరగకపోవడంతో కొత్త రుణాలు అందక రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారన్నారు. ప్రభుత్వం వైఫల్యంతో రైతులు రాయితీ పొందలేక వ్యాపారుల చేతిలో దోపిడీకి గురవుతున్నట్లు పేర్కొన్నారు. కంపెనీలపై ప్రభుత్వం అజమాయిషీ లొపించడం వల్లే విత్తనం ధరలు పెరిగినట్లు, దీంతో ఇష్టారీతిన రేట్లు పెంచారని ఆరోపించారు. రాయితీ ఇవ్వకున్నా సరే కనీసం గత ఏడాది ధరలకైనా విత్తనాలు అందుబాటులో ఉండేలా చూడాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సూచించారు.