
కేసీఆర్‌పై ఎమ్మెల్సీ జీవన్‍రెడ్డి విమర్శలు
కరీంనగర్‍టౌన్, వెలుగు: రాష్ట్రంలో ఇంత అవినీతి ఉందా అని గుండెలు బాదుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గత ఐదేళ్లు ఆయనే సీఎం అనే విషయం మర్చిపోతున్నడని ఎమ్మెల్సీ జీవన్‍రెడ్డి విమర్శించారు. విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా అటెండ్ అయి సంఘీభావం తెలిపి మాట్లాడారు. సీఎం కేసీఆర్ తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చారని ఫైర్‍అయ్యారు. ఐదేళ్లలో రూ.1.8లక్షల కోట్ల అప్పులు చేసి పుట్టబోయే ప్రతి బిడ్డపై 50 వేల రుణ భారం మోపాడన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి నాంది పలికిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు కేసీఆర్ అన్యాయం చేస్తున్నారన్నారు. తెలంగాణ ఏర్పడి ఇన్నేళ్లు గడిచినా కేజీ టూ పీజీ విద్య హామీ నిలబెట్టుకోలేదన్నారు. పక్కనున్న ఏపీలో ఇప్పటికే 2 డీఎస్సీలు పూర్తి చేసి మూడో డీఎస్సీకి రెడీ అవుతుంటే ఇక్కడ ఒక్క డీఎస్సీ ఇప్పుడిప్పుడు పూర్తి చేస్తున్నారని విమర్శించారు.
ప్రభుత్వ విద్య నిర్వీర్యం కావడానికి TRS సర్కారు విధానాలే కారణమన్నారు. ఉపాధ్యాయులకు రావాల్సిన పీఆర్సీ, ఐఆర్ చెల్లించాలని పోరాడుతామన్నారు జీవన్‍రెడ్డి. కొత్త జిల్లాలు ఏర్పాటు చేసామని గొప్పగా చెప్పుకుంటున్న కేసీఆర్.. పాలనపరమైన వెసులుబాటు కోసం కొత్త ఉద్యోగులను ఎందుకు నియమించలేదని ప్రశ్నించారు. తుమ్మడిహట్టి నుంచి సుందిళ్లకు గ్రావిటీ నుంచి నీరు తెచ్చే అవకాశం ఉన్నప్పటికీ అనవసరంగా మేడిగడ్డ పేరుతో రెండు అదనపు లిఫ్టులు ఏర్పాటు చేసారన్నారు. ఫలితంగా 47 కోట్ల రూపాయలు ప్రజలపై భారం పడటంతో పాటు మెయింటేనెన్స్ ఖర్చు గుదిబండ కాబోతోందన్నారు. ఉపాధ్యాయుల న్యాయమైన హక్కుల ను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు. 30 వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయకుండా 16 వేల మంది విద్యా వాలంటీర్లతో నెట్టుకొస్తున్నారని విమర్శించారు.