
తెలంగాణ జాగృతి నేతృత్వంలో ఎమ్మెల్సీ కవిత పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన హోంమంత్రి మహమూద్ అలీ.. కేక్ కట్ చేసి కవితకు శుభాకాంక్షలు తెలియజేశారు. కవిత పుట్టినరోజు సందర్భంగా దివ్యాంగులకు బైకులు, విద్యార్థినిలకు సైకిళ్లను హోంమంత్రి మహమూద్ అలీ అందించారు. అనంతరం తెలంగాణ జాగృతి అధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని హోంమంత్రి ప్రారంభించారు.
తెలంగాణ ఉద్యమంలో జాగృతి సేనతో కలిసి ఎమ్మెల్సీ కవిత ప్రజల్లో అవగాహన తీసుకొచ్చిందని ఆయన అన్నారు. తెలంగాణకే సొంతమైన బతుకమ్మను ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన ఘనత కవితకే దక్కుతుందని ఆయన పొగిడారు. తెలంగాణ ఉద్యమంలో భాగమై.. ఎంతోమంది మహిళలను ఉద్యమంలో ఆమె నడిపించారని హోంమంత్రి అన్నారు. గతంలో ఎంపీగా ఉన్నప్పుడు.. ఇప్పుడు ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత ఆమె ప్రజలకు ఎంతో సేవ చేసిందని ఆయన అన్నారు. భగవంతుని ఆశీస్సులతో కవిత మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.