సేవాలాల్ కు భారత రత్న ఇవ్వాల్సిందే 

సేవాలాల్ కు భారత రత్న ఇవ్వాల్సిందే 

ప్రభుత్వంపై బురదజల్లేందుకు కొందరు కావాలనే వాట్సాప్ లో పనికి రాని ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. తండాలో బతుకమ్మ ఉత్సవాలు చేయడం ఆనందంగా ఉందన్నారు. సేవాలాల్ లంబాడీ జాతికి ఆదర్శమన్నారు. ఆయనకి భారత రత్న ఇవ్వాలని పార్లమెంట్ లో కేంద్రాన్ని కోరామన్నారు.  అంతేకాదు సేవాలాల్ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందన్నారు. విద్యా, ఉద్యోగ రంగాల్లో గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జీవో తీసుకురావడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ లో ఏ ప్రభుత్వం కూడా కుల సంఘాలకు భూమి ఇవ్వలేదని..కానీ 84 కుల సంఘాలకు భూములు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. 

ఒక ఆడబిడ్డగా కల్యాణ లక్ష్మీ పథకం ప్రవేశపెట్టినందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందని కవిత చెప్పారు. ఈ పథకం పుట్టిందే గిరిజన తండాలో అని..పేదింటి ఆడపిల్లల తల్లిదండ్రులకు ఇది ఎంతో ఉపయోగపడుతుందన్నారు. మహిళల రక్షణ కోసం ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. రాష్ట్రంలో మూడు వేలకు పైగా తండాలను గ్రామ పంచాయతీల చేసిన ఘనత కేసీఆర్ దే అన్నారు. లంబాడీల తీజ్ పండుగని  రాష్ట్ర పండుగగా జరుపుకునేలా ముఖ్యమంత్రి దృష్టిని తీసుకెళ్తామన్నారు. బతుకమ్మ ఉత్సవాల కోసం కోటి చీరలు మహిళలకు పంపిణీ చేస్తున్నామన్నారు. మెదక్ జిల్లా నారాయణఖేడ్ మండలం బల్కం చెల్క తండాలో మహిళలతో కలిసి కవిత బతుకమ్మ ఆడారు.