ఢిల్లీలో కూర్చొని మీడియాను తప్పుదారి పట్టించారు

ఢిల్లీలో కూర్చొని మీడియాను తప్పుదారి పట్టించారు

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కలకలం రేపుతోంది. ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) హైదరాబాద్ నగరం సహా దేశవ్యాప్తంగా పలుచోట్ల ఆకస్మిక దాడులు నిర్వహిస్తోంది. ఈ వ్యవహారంలో సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత హస్తం ఉందని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. మరోవైపు కవితకు ఈడీ నోటీసులు ఇచ్చిందంటూ ప్రచారం జరుగుతోంది.దీనిపై ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ వేదికగా స్పందించారు.

‘‘ఢిల్లీలో కూర్చున్న కొంతమంది విష ప్రచారానికి తెగబడ్డారు. వాళ్లు మీడియాకు తప్పుడు సమాచారాన్ని అందిస్తున్నారు’’ అని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. నిజాల్ని చూపించడానికి మాత్రమే మీ విలువైన సమయాన్ని ఉపయోగించండి అని మీడియా సంస్థలకు ఆమె విజ్ఞప్తి చేశారు. ‘‘టీవీ ప్రేక్షకుల విలువైన సమయాన్ని కాపాడేందుకు నేనొక విషయాన్ని చెప్పదలిచాను. స్పష్టత ఇవ్వదలిచాను. నేను  ఎలాంటి నోటీసులనూ అందుకోలేదు’’ అని కవిత స్పష్టం చేశారు. 

ఓ మహిళా నేత ఆడిటర్ ఇంట్లో ఈడీ తనిఖీలు

ఢిల్లీ లిక్కర్ స్కాంలో హైదరాబాద్ లింకులపై ఈడీ కూపీ లాగుతోంది. ఢిల్లీ నుంచి వచ్చిన నలుగురు అధికారుల టీమ్ ఉదయం నుంచి తనిఖీలు చేస్తోంది. రాష్ట్రంలోని ఓ మహిళా నేత ఆడిటర్ ఇంట్లో ఈడీ తనిఖీలు నిర్వహిస్తోంది. దోమలగూడలోని ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు ఇంట్లోనూ ఈడీ తనిఖీలు చేపట్టింది. గోరంట్ల అండ్ అసోసియేట్ ఉద్యోగి శ్రీధర్ ఇంట్లో ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. ఇటు మాదాపూర్ లోని అనూస్ బ్యూటీ పార్లర్ హెడ్ ఆఫీస్ లోనూ ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. అలేఖ్య ప్రణవ్ హోమ్స్ లో కూడా ఈడీ అధికారులు ఉదయం నుంచి సోదాలు చేస్తున్నారు. ఈ స్కాంలో హైదరాబాద్ లింకులపై ఇప్పటికే కేసు నమోదైంది. నిందితుల్లో నగరానికి చెందిన రామచంద్ర పిళ్లై ఉన్నారు.