
హైదరాబాద్, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈనెల 11న విచారిస్తామని సీబీఐ తెలిపింది. ఆ రోజు ఉదయం 11 గంటలకు బంజారాహిల్స్‌లోని ఆమె ఇంట్లోనే విచారణ జరుపుతామని సీబీఐ డీఐజీ రాఘవేంద్ర చెప్పారు. మంగళవారం కవితకు ఈ మెయిల్ చేశారు. దీనిపై తమకు కన్ఫర్మేషన్ ఇవ్వాలని కోరారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా సహా పలువురిపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌పై సీబీఐ, ఈడీ విచారణ జరుపుతున్నాయి. ఈ కుంభకోణంలో సౌత్ గ్రూప్‌ను ఎమ్మెల్సీ కవిత ప్రభావితం చేశారని అమిత్ ఆరోరా రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే లిక్కర్ స్కామ్‌లో తెలిసిన విషయాలు వెల్లడించాలని కోరుతూ సీబీఐ అధికారులు సీఆర్పీసీ 160 కింద కవితకు నవంబర్ 30న నోటీసులు ఇచ్చారు. అదే రోజు తాను విచారణకు సిద్ధమని కవిత ప్రకటించారు. ఈనెల ఆరో తేదీన (మంగళవారం) ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని తన నివాసంలో అందుబాటులో ఉంటానని సీబీఐకి రిప్లయ్ ఇచ్చారు. తర్వాతి రోజు ప్రగతి భవన్‌కు వెళ్లి సీఎం కేసీఆర్‌తో కవిత భేటీ అయ్యారు. సీబీఐ నోటీసులపై ఎలా రియాక్ట్ కావాలనే విషయమై న్యాయ నిపుణులతో చర్చించారు. సీబీఐ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలంటే మనీశ్ సిసోడియా సహా ఇతరులపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్, కేంద్ర హోం శాఖ ఫిర్యాదు కాపీని తనకు అందజేయాలని ఈనెల 3న సీబీఐకి కవిత లేఖ రాశారు. తమ వెబ్‌సైట్‌లో ఎఫ్ఐఆర్ ఉందని సీబీఐ నుంచి కవితకు రిప్లయ్ ఇచ్చారు. దీనిపై సోమవారం సీబీఐకి కవిత మళ్లీ లేఖ రాశారు. ముందే నిర్ణయించిన కార్యక్రమాల వల్ల మంగళవారం తాను విచారణకు రాలేనని, ఎఫ్‌ఐఆర్‌లోని నిందితుల జాబితాలో తన పేరు లేదని పేర్కొన్నారు. సీబీఐకి వివరణ ఇచ్చేందుకు ఈ నెల 11, 12, 14, 15 తేదీల్లో తన నివాసంలో అందుబాటులో ఉంటానని సమాచారం ఇచ్చారు. దీనిపై సీబీఐ అధికారులు..11న వివరణ తీసుకునేందుకు ఆమె నివాసానికే వస్తామని బదులిచ్చారు.
వివరణ ఇచ్చేందుకు సిద్ధం: కవిత
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు సంబంధించిన కేసులో 11న ఉదయం 11 గంటలకు తన నివాసంలో వివరణ ఇచ్చేందుకు అందుబాటులో ఉంటానని కవిత తెలిపారు. మంగళవారం రాత్రి సీబీఐ డీఐజీ రాఘవేంద్ర వస్తాకు ఈ మెయిల్ చేశారు.
తన ఇంట్లోనే కవిత
ముందే ఖరారైన కార్యక్రమాలతో మంగళవారం సీబీఐకి వివరణ ఇవ్వలేనని లేఖ రాసిన కవిత.. రోజంతా బంజారాహిల్స్‌లోని తన నివాసంలోనే ఉండిపోవడం గమనార్హం. సీఎం కేసీఆర్ బుధవారం జగిత్యాల జిల్లా పర్యటనకు వెళ్తున్నారు. ఈ కార్యక్రమ ఏర్పాట్ల పర్యవేక్షణకు ఆమె మంగళవారం జగిత్యాలకు వెళ్తారని ఆమె కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. కవిత ఇంతకు ముందే ఇచ్చిన సమాచారం మేరకు మంగళవారం ఆమెను విచారించేందుకు ఢిల్లీ నుంచి సీబీఐ అధికారులు సోమవారమే హైదరాబాద్‌కు చేరుకున్నారు. కవిత లేఖపై సీబీఐ నుంచి రిప్లయ్ రాకపోవడంతో ఏ క్షణమైనా అధికారులు ఆమె నివాసానికి రావొచ్చని ప్రచారమైంది. అందుకే కవిత జగిత్యాలకు వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నారని ఆమె వర్గీయులు చెప్తున్నారు.