
- కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి వినతి
హైదరాబాద్, వెలుగు: విద్యాహక్కు చట్టంలోని సెక్షన్23(2)ను సవరించాలని టీచర్ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. తద్వారా దేశంలో వివిధ రాష్ర్టాల్లో ప్రస్తుతం పనిచేస్తున్న టీచర్లను టెట్ పరీక్ష నుంచి మినహాయించాలని విజ్ఞప్తి చేశారు. ఆదివారం హైదరాబాద్ లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పుల్గం దామోదర్ రెడ్డి, ఇతర నేతలతో కలిసి వినతిపత్రం అందించారు.
ఈ సందర్భంగా పలు విద్యారంగం, టీచర్ల సమస్యలను ఆయన దృష్టికి తీసుకుపోయారు. దీనికి సానుకూలంగా కిషన్ రెడ్డి స్పందించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దృష్టికి ఈ సమస్యను తీసుకుపోతానని ఆయన హామీ ఇచ్చారు. దీంతో పాటు దీర్షకాలికంగా ఉన్న ఏకీకృత సర్వీసు నిబంధనల అమలుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తగు ప్రతిపాదనలు పంపిస్తే.. కేంద్ర హోంశాఖ నుంచి ఉత్తర్వులు ఇప్పిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ నేతలు ఆనంద్ రెడ్డి, నవీన్ రెడ్డి, గిరిధర్ పాల్గొన్నారు.