ఎమ్మెల్సీలు సహకరించలే!.. సన్నిహితుల వద్ద బీఆర్ఎస్ మాజీ ఎమెల్యేల ఆవేదన

ఎమ్మెల్సీలు సహకరించలే!.. సన్నిహితుల వద్ద బీఆర్ఎస్ మాజీ ఎమెల్యేల ఆవేదన
  • 15 నుంచి 20 స్థానాల్లో అంటీముట్టనట్లున్న ప్రచారం
  • అసెంబ్లీ టికెట్లు ఆశించి భంగపడడమే కారణం
  • సిట్టింగులకు సహకరించొద్దని వెంట నడిచే క్యాడర్ కు మెసేజ్​లు
  • కాంగ్రెస్​ వేవ్.. ప్రభుత్వ వ్యతిరేకత.. ఇంటిపోరు.. తోడై ఓడిన గులాబీ పార్టీ అభ్యర్థులు

వరంగల్‍, వెలుగు: తమ ఓటమికి బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీలే కారణమని ఆ పార్టీ తాజా మాజీ ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. అసెంబ్లీ టికెట్లు ఆశించి భంగపడిన ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్సీలు ఎవరూ తమకు సహకరించలేదని చెప్పుకుంటున్నారు. వెంట తిరుగుతూనే గెలుపు అవకాశాలను దెబ్బ తీశారని సన్నిహితుల వద్ద వాపోతున్నారు. కాంగ్రెస్ ​వేవ్, ప్రభుత్వ వ్యతిరేకతతోపాటు ఇంటిపోరు తమ విజయానికి గండి కొట్టాయని అంటున్నారు. కాగా, నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలే సుప్రీం అన్నట్లు కేసీఆర్‍ హుకుం జారీ చేయడంతో ప్రొటోకాల్‍ ప్రకారం గౌరవం దక్కాల్సిన ఎమ్మెల్సీలు డమ్మీలుగా మిగిలారు. భవిష్యత్‍లో తమ టికెట్​కు ఎక్కడ ఎసరు పెడతారోననే భయంతో ఎమ్మెల్యేలు సైతం మొన్నటి దాకా ఎమ్మెల్సీలను శత్రువులుగా చూస్తూ వచ్చారు. ‘ఎమ్మెల్సీ’ పదవి కేవలం అలకరణ ప్రాయంగా మారిందని కొందరు తమకు తెలిసిన ముఖ్య నేతలకు చెప్పుకుని బాధపడిన సందర్భాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే చాలా మంది ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. రూ.కోట్లు ఖర్చు చేయాలని తెలిసినా ఎక్కడా వెనక్కి తగ్గలేదు. గాడ్​ఫాదర్ల ద్వారా హైకమాండ్​తో సంప్రదింపులు జరిపారు. కానీ, చివరికి బీఆర్ఎస్ ​బాస్ ​కేసీఆర్ ​సిట్టింగులకే టికెట్లు అని తేల్చి చెప్పడంతో అంతా నిరాశకు లోనయ్యారు. టికెట్లు దక్కలేదనే బాధతో సిట్టింగ్​ఎమ్మెల్యేలతో అంటీ ముట్టనట్లు వ్యవహరించారు. తమ వెంట ఉన్న క్యాడర్ కు ఇవ్వాల్సిన మెసేజ్‍ ఇచ్చేశారు. దీంతో ఈజీగా గెలుస్తారనుకున్న స్థానాల్లోనూ బీఆర్‍ఎస్‍ అభ్యర్థులు ఘోర ఓటమి చవిచూశారు.

తమవంతు ప్రయత్నం..

రాష్ట్రంలోని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు వివిధ నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యే టిక్కెట్‍ కోసం ప్రయత్నాలు చేశారు. ఉమ్మడి వరంగల్‍ జిల్లా నుంచి 8 మంది ఎమ్మెల్సీలుగా ఉండగా మంత్రి సత్యవతి రాథోడ్‍ డోర్నకల్‍ నుంచి, సిరికొండ మధుసూదనచారి భూపాలపల్లి, కడియం శ్రీహరి స్టేషన్‍ఘన్‍పూర్‍, పల్లా రాజేశ్వర్‍రెడ్డి జనగామ, బస్వరాజు సారయ్య వరంగల్​ఈస్ట్, పోచంపల్లి శ్రీనివాస్‍రెడ్డి జనగామ ఎమ్మెల్యే టిక్కెట్ల కోసం ట్రై చేశారు. బండ ప్రకాశ్‍ శాసనమండలి వైస్‍ చైర్మన్‍గా ఉండగా.. మహబూబాబాద్‍ జిల్లాకు చెందిన తక్కళ్లపల్లి రవీందర్‍రావుకు రిజర్వేషన్ కలిసి రాలేదు. దీంతో వీళ్లిద్దరూ సైలంట్​గా ఉన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా తాండూరు నుంచి ఎమ్మెల్సీ పట్నం మహేందర్‍రెడ్డి, కుత్బుల్లాపూర్‍ నుంచి ఎమ్మెల్సీ శంభీపూర్‍ రాజు, పెద్దపల్లి నుంచి ఎమ్మెల్సీ భానుప్రకాశ్‍రావు, మెదక్‍ నుంచి శేరి సుభాష్‍రెడ్డి, గద్వాల జిల్లా అలంపూర్‍ స్థానాన్ని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి ఆశించారు. మొత్తంగా కొందరు బయట తమవంతు ప్రయత్నాలు చేసుకోగా, చాలామంది టిక్కెట్‍ కోరికను పెద్దల దృష్టికి తీసుకువెళ్లారు.

వెంట తిరగలేక పక్క జిల్లాలకు..

రాష్ట్రంలో మొత్తం 40 మంది ఎమ్మెల్సీలుగా ఉండగా.. 16 నుంచి 20 మంది ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యే అవ్వాలని ఆశ పడ్డారు. వరంగల్‍ ఈస్ట్, మహబూబాబాద్‍ వంటి స్థానాల్లో సిట్టింగ్‍ ఎమ్మెల్యేలకు కాకుండా టిక్కెట్ల కేటాయింపులో వేరేవారి పేర్లు పరిశీలించాలని లోకల్‍ ఎమ్మెల్సీలు హైకమాండ్​ను రిక్వెస్ట్ చేశారు. అయితే ‘తాము చెప్పిందే వేదం’అన్నట్లు కేసీఆర్‍ నిర్ణయాలు నడిచాయి. దీంతో కొందరు ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్సీలు ప్రచారంలో సిట్టింగ్‍ ఎమ్మెల్యేలతో నడవలేక ఇతర జిల్లాలకు ఇన్​చార్జీలుగా వెళ్లారు. దీనికితోడు రాష్ట్రంలో మారిన రాజకీయ సమీకరణాలు బీఆర్ఎస్ సిట్టింగ్​ఎమ్మెల్యేలకు గెలుపును దూరం చేశాయి. అన్నిచోట్ల కాంగ్రెస్​గాలి వీయడంతో  తమకు పోటీయే లేదని భావించిన16కు పైగా స్థానాల్లో బీఆర్ఎస్​ఓటమి పాలైంది. ఎమ్మెల్సీలు సహకరించడంతోపాటు అంతా అనుకున్నట్లు జరిగి ఉంటే కారు పార్టీకి 55 స్థానాలు వచ్చేవని విశ్లేషకులు భావిస్తున్నారు. సిట్టింగులకు టిక్కెట్లు కేటాయించి తప్పుచేసిందని అంటున్నారు. జనగామలో పల్లా రాజేశ్వరరెడ్డి, స్టేషన్‍ ఘన్‍పూర్‍లో కడియం శ్రీహరి, హుజూరాబాద్‍లో పాడి కౌశిక్‍రెడ్డికి మాత్రమే ఎమ్మెల్యే టిక్కెట్లు కేటాయించడంతో వారు విజయం సాధించారు.

టికెట్‍ రానిదే నయం

రాష్ట్రంలో లోకల్‍, ఎమ్మెల్యే, గ్రాడ్యుయేట్‍, టీచర్స్, గవర్నర్‍ కోటాలో మొత్తంగా 40 మంది ఎమ్మెల్సీలు ఉండగా కాంగ్రెస్‍, ఎంఐఎం నుంచి నలుగురైదుగురు తప్పించి మిగతా వారంతా బీఆర్‍ఎస్‍ పార్టీకి చెందినవారే ఉన్నారు. ఇందులో తక్కువలో తక్కువ 2025 మార్చి వరకు పదవీ కాలం ఉన్నోళ్లు ఉన్నారు. ఇంకొందరి పదవీ కాలం 2027 నవంబర్‍, 2028 జనవరి వరకు ఉంది. ఈ ఏడాది మార్చిలో ఎన్నికైనవారు గరిష్ఠంగా 2029 మార్చి వరకు కొనసాగనున్నారు. ప్రభుత్వాలు మారినా పదవుల విషయంలో వీరికి ఎటువంటి ఇబ్బందులు లేవు. బీఆర్ఎస్​ఓటమిని చూసిన కొందరు ఓ విధంగా తమకు ‘ఎమ్మెల్యే టికెట్‍ రాకపోవడమే నయం అయింది’ అని భావిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత, కాంగ్రెస్‍ వేవ్‍లో తాము ఓడితే.. కోట్లాది రూపాయలు బూడిదలో పోసిన పన్నీరు అయ్యేదని, పైగా ఓడిపోయారనే అపవాదు నుంచి బయటపడ్డామని సంతోష పడుతున్నారు.