హర్యానాలో ఇంటర్నెట్ సేవలు షురూ.. రెండు రోజుల పాటు కర్ఫ్యూ సడలింపు

హర్యానాలో ఇంటర్నెట్ సేవలు షురూ.. రెండు రోజుల పాటు కర్ఫ్యూ సడలింపు

చండీగఢ్: హర్యానాలోని నుహ్‌‌‌‌లో ఆదివారం అర్ధరాత్రి నుంచి మొబైల్ ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించారు. సోమ, మంగళవారం(ఉదయం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు) కర్ఫ్యూను సడలిస్తున్నట్లు డిప్యూటీ కమిషనర్ ధీరేంద్ర ఖర్గటా వెల్లడించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా నుహ్‌‌‌‌లో హర్ ఘర్ తిరంగా ప్రచార కార్యక్రమాన్ని కూడా  ప్రారంభించినట్లు తెలిపారు. నుహ్‌‌‌‌లోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై జాతీయ జెండాను ఎగరవేస్తామని వివరించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఇప్పటికే ఇంద్రి బ్లాక్‌‌‌‌లోని హిలాల్‌‌‌‌పూర్ గ్రామంలోని ప్రజలు యాత్ర చేపట్టారని, ఇది మంగళవారం వరకు కొనసాగుతుందని చెప్పారు. 

ఏం జరిగిందంటే..!

జులై 31న నుహ్ జిల్లాలో  విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌‌‌‌పీ )'బ్రిజ్ మండల్ జలాభిషేక యాత్ర' నిర్వహించింది. ఓ వర్గానికి చెందిన కొందరు యాత్రపై రాళ్లు రువ్వారు. దీంతో చెలరేగిన ఘర్షణల్లో ఇద్దరు హోం గార్డులు, ఓ మత పెద్ద సహా ఆరుగురు చనిపోయారు. ఘర్షణలు తీవ్రరూపం దాల్చడంతో పాఠశాలలు, ఇతర విద్యాసంస్థలు మూసివేశారు. ఆర్టీసీ బస్ సర్వీసులను కూడా బంద్ చేశారు. సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులను అప్‌‌‌‌లోడ్ చేయకుండా నుహ్‌‌‌‌లో మొబైల్ ఇంటర్నెట్, బ్రాడ్‌‌‌‌బ్యాండ్, ఎస్ఎమ్ఎస్ సేవలు నిలిపివేశారు. ప్రస్తుతం నుహ్‌‌‌‌లో పరిస్థితులు కాస్త మెరుగుపడటంతో ఈ నెల 11న విద్యాసంస్థలను, 13న ఇంటర్నెట్ సేవలను తిరిగి ప్రారంభించారు. బస్సుల సేవలను కూడా పునరుద్ధరించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా రెండు రోజుల పాటు కర్ఫ్యూ ను సడలించారు.