రూ. 29 కోట్లతో హఫీజ్‌‌పేట రైల్వే స్టేషన్‌‌కు హంగులు

రూ. 29 కోట్లతో హఫీజ్‌‌పేట రైల్వే స్టేషన్‌‌కు హంగులు

హైదరాబాద్, వెలుగు: అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ (ఏబీఎస్ఎస్) కింద హైదరాబాద్‌లోని హఫీజ్‌‌పేట రైల్వే స్టేషన్‌‌లో రూ.29.21 కోట్లతో ఆధునీకరణ పనులు చేపట్టారు. ఇప్పటికే ప్లాట్‌‌ఫాం షెల్టర్, సర్క్యులేటింగ్ ఏరియా, స్టేషన్ బిల్డింగ్ సివిల్ పనులు పూర్తయ్యాయని సౌత్ సెంట్రల్ రైల్వే బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. వెయిటింగ్ హాల్ పునరుద్ధరణ, 12 మీటర్ల వెడల్పు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, లిఫ్ట్‌‌లు, ఎస్కలేటర్‌‌లు, సైనేజ్ బోర్డులు, టాయిలెట్ బ్లాక్‌‌లు, ఫసాడ్ లైటింగ్ పనులు ఇంకా కొనసాగుతున్నాయని తెలిపింది. 

ఈ పనులు ఒకటి లేదా 2 నెలల్లో పూర్తయ్యే అవకాశం ఉందని పేర్కొంది. హఫీజ్‌‌పేట రైల్వే స్టేషన్‌‌.. హైదరాబాద్ , సికింద్రాబాద్ జంట నగరాల్లోని సబర్బన్ రైల్వే స్టేషన్‌‌లలో చాలా ముఖ్యమైంది. రోజుకు సుమారు 9 వేల మంది ప్యాసింజర్లు ఈ స్టేషన్‌‌ను వినియోగిస్తున్నారు. ఇక్కడి నుంచి 60 ఎంఎంటీఎస్ రైళ్లు, 8 ఎక్స్‌‌ప్రెస్ రైళ్లు నడుస్తాయి. కాగా, అమృత్‌‌ భారత్‌‌ స్కీమ్ కింద రాష్ట్రంలో మొత్తం రూ.2,752 కోట్లతో 40 స్టేషన్‌‌ల పునరాభివృద్ధి జరుగుతుండగా.. లిస్టులో సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ, లింగంపల్లి స్టేషన్‌‌లు కూడా ఉన్నాయి. వీటిని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఆధునీకరించనున్నారు.