- గత మూడేండ్లలో 11 లక్షల ఉద్యోగాలిచ్చినం: బండి సంజయ్
- ఫోన్ ట్యాపింగ్ ఎంక్వైరీ అంతా ఉత్త ముచ్చటే
- ఫాంహౌస్, ఏఐసీసీ మధ్య డీల్ కుదిరేదాకా సాగదీస్తరని కామెంట్
- హకీంపేట రోజ్ గార్ మేళాలో పాల్గొన్న కేంద్ర మంత్రి
హైదరాబాద్, వెలుగు: నిరుద్యోగుల కష్టం ప్రధాని నరేంద్ర మోదీకి బాగా తెలుసని, అందుకే ఎలాంటి పైరవీలు, లంచాలకు తావులేకుండా జాబ్ క్యాలెండర్ ప్రకారం లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నరని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. శనివారం18వ రోజ్‌గార్ మేళాలో భాగంగా హకీంపేటలోని సీఐఎస్ఎఫ్ నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ(నిసా)లో 61 మందికి నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా శనివారం 61 వేల మందికి ఉద్యోగాలిచ్చామని చెప్పారు.
గత మూడేండ్లలో 11 లక్షల పోస్టులు భర్తీ చేసిన ఘనత మోదీదేనని కొనియాడారు. ‘‘హైదరాబాద్ అశోక్ నగర్ లైబ్రరీ కాడ డబ్బుల్లేక, ఆకలైతే రెండు అరటి పండ్లు తిని చదువుకున్నోళ్లను నేను కళ్లారా చూసిన. ఆ బాధ మోదీకి తెలుసు కాబట్టే పారదర్శకంగా నియామకాలు చేపడుతున్నరు’’ అని సంజయ్ చెప్పారు. తల్లిదండ్రుల కష్టానికి, త్యాగానికి ఫలితమే ఈ ఉద్యోగాలని, బిడ్డల విజయం చూసి వారి కళ్లల్లో ఆనందం కనిపిస్తోందన్నారు.
ఉద్యోగం అంటే జీతం మాత్రమే కాదు బాధ్యత అని గుర్తుంచుకోవాలని, యూనియన్ల మాట విని సమ్మెలు చేస్తే నష్టపోతారని కొత్త ఉద్యోగులను బండి సంజయ్ హెచ్చరించారు. గతంలో అనవసరంగా సమ్మె చేసిన 25 వేల మంది పోస్టల్ ఉద్యోగులను కేంద్ర ప్రభుత్వం సస్పెండ్ చేసిందని.. తాను చొరవ తీసుకొని సస్పెన్షన్ ఎత్తివేయించానని తెలిపారు. నిజాయతీగా పనిచేసి శాఖకు వన్నె తేవాలని సూచించారు. 2047 నాటికి భారత్‌ను విశ్వగురుగా నిలపాలన్న మోదీ యజ్ఞంలో ఉద్యోగులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
కొంపలు ముంచినోడు సాక్షి ఎట్లైతడు?
ఉద్యోగులకు నియామకపత్రాలు అందజేసిన తరువాత బండి సంజయ్ మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ పేరుతో కాంగ్రెస్ సర్కార్ ఆడుతున్న డ్రామాలు చూసి జనం నవ్వుకుంటున్నారని, ప్రభుత్వం అభాసుపాలవుతోందని మండిపడ్డారు. బీఆర్ఎస్ నేత కేటీఆర్ ట్యాపింగ్‌తో ఎంతోమంది కొంపలు ముంచారని, ఆయనను నిందితుడిగా చేర్చాల్సింది పోయి.. సాక్షిగా పిలిచి వాంగ్మూలం తీసుకోవడమేంది? అని ప్రశ్నించారు.
ఫాంహౌస్, ఏఐసీసీ మధ్య డీల్ కుదిరేదాకా ఈ విచారణ నాటకం సాగుతూనే ఉంటుందని ఎద్దేవా చేశారు. సిట్‌లో సమర్థులైన అధికారులున్నా.. సర్కార్ వారిని స్వేచ్ఛగా పని చేయనివ్వకుండా అజమాయిషీ చేస్తోందని, అందుకే అసలు దోషులు తప్పించుకుంటున్నారని ఆరోపించారు. కాగా, రాష్ట్రంలో టీజీపీఎస్సీ అంటేనే లీకేజీలు, పైరవీలు, కోర్టు కేసులు, ధర్నాలు అన్నట్టుగా మారిందని.. ఇక్కడ ఉద్యోగాల భర్తీ అంటేనే ఒక ప్రహసనంగా తయారైందని సంజయ్ దుయ్యబట్టారు.
కాంగ్రెస్ సర్కార్ చేతులెత్తేసినా నిరుద్యోగులు నిరాశపడొద్దని, మోదీ సర్కార్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఒక్క పైరవీ, అవినీతి లేకుండా కేంద్రం జాబ్ క్యాలెండర్ ప్రకారం లక్షల కొలువులు భర్తీ చేస్తోందని చెప్పారు. స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా వంటి పథకాలతో యువత తమ కాళ్లపై తాము నిలబడటమే కాకుండా.. పది మందికి ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదుగుతున్నారని అన్నారు.
