జోనల్ వ్యవస్థలో సవరణలు

జోనల్ వ్యవస్థలో సవరణలు
  • మార్పులతో కొత్త జోన్లు
  • కేంద్ర గెజిట్‌‌‌‌కు అనుగుణంగా రాష్ట్ర సర్కార్ ​ఉత్తర్వులు
  • జోగులాంబ జోన్​లోకి నారాయణపేట.. 
  • కాళేశ్వరం జోన్​లోకి ములుగు
  • చార్మినర్​ జోన్​కు మారిన వికారాబాద్​ జిల్లా

హైదరాబాద్, వెలుగు: సవరణలతో కూడిన కొత్త జోనల్ వ్యవస్థపై రాష్ట్ర సర్కార్ ​ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో రాష్ట్ర ప్రభుత్వం​ చేసిన మార్పులు, చేర్పుల ప్రతిపాదనలను ఆమోదిస్తూ ఏప్రిల్​లో కేంద్ర హోంశాఖ ఇచ్చిన గెజిట్ కు అనుగుణంగా సీఎస్​ సోమేశ్​​కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఇటీవల సీఎం కేసీఆర్​ప్రకటించిన 50 వేల ఉద్యోగాల భర్తీకి లైన్​క్లియర్​అయింది. కొత్త జోనల్​ వ్యవస్థ ప్రకారం నారాయణపేట జిల్లాను జోగులాంబ జోన్​లో, ములుగు జిల్లాను కాళేశ్వరం జోన్​లో కలిపారు. వికారాబాద్​జిల్లాను జోగులాంబ జోన్​నుంచి చార్మినర్ ​జోన్ కు మార్చారు. వాస్తవానికి 2018 ఆగస్టులోనే 31 జిల్లాలతో కూడిన కొత్త జోనల్​ వ్యవస్థకు రాష్ట్రపతి​ ఆమోదం లభించింది. అయితే ఆ తర్వాత కొత్తగా నారాయణపేట, ములుగు జిల్లాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో ఈ రెండు జిల్లాలతోపాటు జోగులాంబ జోన్​లో ఉన్న వికారాబాద్‌‌‌‌ జిల్లాను చార్మినార్‌‌‌‌ జోన్​లో కలుపుతూ కొత్త సవరణల ప్రపోజల్స్​ను 2019లో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపించింది. ఈ ప్రపోజల్స్​కు ఏప్రిల్ లో ఆమోదం లభించగా ఇప్పుడు సీఎస్ తెలంగాణ పబ్లిక్‌‌‌‌ ఎంప్లాయ్‌‌‌‌మెంట్‌‌‌‌ (ఆర్గనైజేషన్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ రెగ్యులేషన్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ డైరెక్ట్‌‌‌‌ రిక్రూట్‌‌‌‌మెంట్‌‌‌‌) కింద జీవో ఇచ్చారు.

2 మల్టీ జోన్లు.. 7 జోన్లు
మొత్తం రెండు మల్టీ జోన్లు, ఏడు జోన్లు ఏర్పాటు చేశారు. దీని ప్రకారమే పోలీసు శాఖ మినహా అన్ని డిపార్ట్ మెంట్ల ఉద్యోగాల భర్తీ ఉండనుంది.

  •   మల్టీ జోన్–1 పరిధిలో ఫస్ట్​జోన్ కాళేశ్వరంలో కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్​భూపాలపల్లి, ములుగు జిల్లాలున్నాయి.. రెండో జోన్​ బాసరలో ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్​ జగిత్యాల జిల్లాలున్నాయి.. మూడో జోన్ రాజన్నలో కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి జిల్లాలున్నాయి.. నాల్గో జోన్ ​భద్రాద్రిలోని ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలున్నాయి. 
  •     మల్టీ జోన్–2 పరిధిలో ఐదో జోన్ యాదాద్రిలోని సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి భువనగిరి, జనగామ జిల్లాలు.. ఆరో జోన్ చార్మినార్‌‌‌‌లోని మేడ్చల్​మల్కాజిగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్​ జిల్లాలు.. ఏడో జోన్ జోగులాంబలోని మహబూబ్​నగర్, నారాయణపేట, జోగులాంబ గద్వాల, వనపర్తి, నాగర్​ కర్నూల్​జిల్లాలున్నాయి.

పోలీసు డిపార్ట్​మెంట్​కు ఇలా..

  •    మల్టీజోన్–1లో కాళేశ్వరం జోన్‌‌‌‌లోని జయశంకర్​ భూపాలపల్లి, రామగుండం పోలీస్​ కమిషనరేట్, కొమురం భీం ఆసిఫాబాద్, ములుగు జిల్లాలు.. రెండో జోన్​బాసరలో ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ పోలీస్​ కమిషనరేట్, జగిత్యాల జిల్లాలు.. మూడో జోన్​ రాజన్నలో కరీంనగర్​ పోలీస్​ కమిషనరేట్, సిద్దిపేట పోలీస్​ కమిషనరేట్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్​ జిల్లాలు.. నాలుగో జోన్​ భద్రాద్రిలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం పోలీస్​ కమిషనరేట్, మహబూబాబాద్, వరంగల్​ పోలీస్ కమిషనరేట్  ఉంది.
  •     మల్టీజోన్–2లో ఐదో జోన్ యాదాద్రిలోని సూర్యాపేట, నల్గొండ, రాచకొండ పోలీస్​ కమిషనరేట్, ఆరో జోన్​చార్మినార్‌‌‌‌లో హైదరాబాద్ ​పోలీస్​ కమిషనరేట్, సైబరాబాద్​ పోలీస్ కమిషనరేట్, సంగారెడ్డి, వికారాబాద్​ జిల్లాలు, ఏడో జోన్​ జోగులాంబలోని మహబూబ్​నగర్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల, నాగర్ కర్నూల్ జిల్లాలున్నాయి.