క్రికెటర్ షమీకి హైకోర్టు షాక్.. ప్రతీనెల భార్య, కూతురికి భారీగా భరణం చెల్లించాలని ఆదేశం

క్రికెటర్ షమీకి హైకోర్టు షాక్.. ప్రతీనెల భార్య, కూతురికి భారీగా భరణం చెల్లించాలని ఆదేశం

క్రికెటర్ షమీకి కలకత్తా హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. విడాకుల కేసులో భార్యతో పాటు, కూతురుకి కూడా భరణం చెల్లించాల్సిందిగా ఆదేశిస్తూ షాకిచ్చింది కోర్టు. మెయింటెనెన్స్ ఖర్చుల కింద  నెలకు రూ.4 లక్షల భారీ మొత్తా్న్ని చెల్లించాలని సూచించింది.

ఈ మొత్తంలో భార్య హసీన్ జహాన్ కు లక్షా 50 వేల రూపాయలు, కూతురు ఐరాకు 2 లక్షల యాభై వేలు చెల్లించాల్సిందేనని స్పంష్టం చేసింది. గత ఏడు సంవత్సరాలకు గాను భరణం చెల్లించాల్సిందిగా సూచించింది.

ఇంతకు ముందు ఈ కేసులో షమీ తన భార్య, కూతురుకు కలిపి నెలకు లక్షా 30 వేల రూపాయలు చెల్లించాలని దిగువ కోర్టు ఆదేశించింది. ట్రైయల్ కోర్టు ఆర్డర్ ను సమీక్షించిన హైకోర్టు.. భరణం నెలకు  రూ.4 లక్షలు చెల్లించాల్సింది ఆదేశించడం గమనార్హం.  అదే విధంగా ఈ కేసును ఆరు నెలల్లోగా పరిష్కరించాల్సిందిగా దిగువ కోర్టును ఆదేశించింది.

షమీ, హసీన్ జహాన్ కు 2014లో వివాహం కాగా, 2018లో విడిపోయారు. తన భర్త షమీ తనపై గృహ హింసకు పాల్పడుతున్నాడని హసీన్ 2018లో షమీపై కోల్ కతాలోని జాదవ్ పూర్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. దీంతో పోలీసులు వరకట్నం వేధింపులు, గృహ హింస చట్టాల్లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. 

అదే సమయంలో తమ ఖర్చుల కోసం నెలకు రూ.10 లక్షలు భరణం ఇచ్చేలా ఆదేశించాలంటూ హసీన్ కోర్టును ఆశ్రయించింది. ఇందులో రూ. 7లక్షలు తన ఖర్చుల కోసం కాగా మిగిలిన రూ.3 లక్షలు కూతురు మెయింటెనెన్స్ కోసమని పిటిషన్ లో పేర్కొంది. అప్పట్లో కేసు విచారించిన ట్రయల్ కోర్టు నెలకు రూ.1.30లక్షల భరణం చెల్లించాలని ఆదేశించింది. తాజాగా ట్రయల్ కోర్టు తీర్పును సమీక్షించిన హైకోర్టు భరణం పెంచడంతో పాటు ఆరు నెలల్లో కేసును పరిష్కరించాల్సిందిగా ఆదేశించింది.