మొజ్తాబా ఖమేనీ బతికే ఉన్నాడా..? ఇరాన్ సుప్రీం లీడర్‌పై అమెరికా సంచలన ప్రకటన

మొజ్తాబా ఖమేనీ బతికే ఉన్నాడా..? ఇరాన్ సుప్రీం లీడర్‌పై అమెరికా సంచలన ప్రకటన

వాషింగ్టన్: ఇరాన్-అమెరికా యుద్ధం మొదలైన నాటి నుంచి ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ బయటి ప్రపంచానికి కనిపించలేదు. దీంతో అసలు ఆయన బతికున్నారా.. లేదా..? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో మొజ్తాబా ఖమేనీ గురించి అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ బతికే ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. 

అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో గాయపడ్డ ఆయన త్వరగా కోలుకుంటున్నారని తెలిపారు. ప్రస్తుతం ఇరాన్ అంతర్గత నిర్ణయాలలో, ప్రభుత్వ వ్యవహారాలలో ఖమేనీ మరింత చురుగ్గా పాల్గొంటున్నట్లు సమాచారం ఉందన్నారు. ఇరాన్ సుప్రీం లీడర్‏గా పదవి బాధ్యతలు చేపట్టి నాటి నుంచి ఆయన బహిరంగంగా ఎక్కడా కనిపించనప్పటికీ.. కేవలం లేఖలు, మధ్యవర్తుల ద్వారా మాత్రమే పాలన నడిపిస్తున్నారని తెలిపారు. 

2026, ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‎పై దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు పలువురు మృతి చెందారు. అయతొల్లా ఖమేనీ కుమారుడు మొజ్తాబా ఖమేనీ ఈ దాడిలో తీవ్రంగా గాయపడి ప్రాణాలతో బయటపడ్డాడు. 

రహస్య ప్రదేశంలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఈ యుద్ధం మొదలైనప్పటి నుంచి మొజ్తాబా ఖమేనీ బయట ఎక్కడ కనిపించలేదు. దీంతో అతడు ప్రాణాలతో ఉన్నాడా లేదా అమెరికా దాడిలో మరణించాడా అన్న సందేహాలు నెలకొన్నాయి. ఈ తరుణంలో మొజ్తాబా ఖమేనీ ప్రాణాలతోనే ఉన్నాడని అమెరికా ధృవీకరించడంతో ఉత్కంఠకు తెరపడింది.