ఎడ్యుకేషన్‌‌కు ఫుల్లు పైసల్‌‌

ఎడ్యుకేషన్‌‌కు ఫుల్లు పైసల్‌‌

గతేడాదితో పోలిస్తే రాష్ట్రానికి ఎక్కువ ఫండ్స్

ఎస్ఎస్ఏకు గతేడాది కంటే రూ. 327 కోట్లు ఎక్కువ

ఐఐటీకి గతేడాది రూ.11కోట్లు.. ఈ సారి రూ. 80 కోట్లు

నిట్‌‌కు కూడా కేటాయింపులు పెంచిన కేంద్రం

హైదరాబాద్, వెలుగు: ఈ ఏడాది రాష్ట్రంలో ఎడ్యుకేషన్‌‌కు సెంట్రల్‌‌ నుంచి నిధులు పెరిగాయి. గతేడాదితో పోలిస్తే అన్ని విభాగాల్లోనూ కేంద్రం ఎక్కువ నిధులు రిలీజ్ చేసింది. సమగ్ర శిక్షా అభియాన్​(ఎస్ఎస్ఏ)తో పాటు ఐఐటీ, నిట్ సంస్థలకూ డబ్బుల వాటా పెంచింది. అయితే మరిన్ని నిధులూ ఇచ్చేందుకూ కేంద్రం సముఖంగానే ఉన్నదని ఎడ్యుకేషన్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌ ఆఫీసర్లు చెబుతున్నారు.

స్కూల్​ఎడ్యుకేషన్‌‌లో ఎస్ఎస్ఏది కీలకపాత్ర. ఈ స్కీమ్ కింద జరిగే కార్యక్రమాలకు సెంట్రల్ గవర్నమెంట్  60 శాతం నిధులిస్తుంది. మిగిలిన 40 శాతం నిధుల్ని స్టేట్ గవర్నమెంట్ ఖర్చు చేస్తుంది. 2019–-20 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్‌‌లో విద్యాశాఖకు రూ.9,899.8 కోట్లు కేటాయించారు. ఈ మొత్తం 2018–19తో పోలిస్తే రూ.3,378 కోట్లు తక్కువ. అయితే ఈ నిధులు దాదాపు ఎంప్లాయీస్‌‌ శాలరీలు, అడ్మినిస్ర్టేషన్‌‌కే సరిపోతాయి. దీంతో సెంట్రల్​నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు విద్యాశాఖ అధికారులు ప్లాన్‌‌ రెడీ చేశారు. ఎస్ఎస్ఏ స్కీమ్ కింద కేంద్రం 2018–19లో మన రాష్ట్రానికి 688.40 కోట్లు రిలీజ్​చేస్తే, 2019–20 విద్యాసంవత్సరంలో జనవరి నాటికి రూ.1,015.05 కోట్లు ఇచ్చింది. అంటే అదనంగా రూ.327 కోట్లు ఎక్కువ వచ్చాయి. కాలేజీల అభివృద్ధికి ఇచ్చే రాష్ట్రీయ ఉచ్చతర్‌‌ శిక్షా అభియాన్‌‌ (రూసా) సెకండ్ ఫేజ్‌‌లో కేంద్రం రాష్ట్రానికి రూ.336 కోట్లు కేటాయించింది. దీంట్లో కొంత అమౌంట్‌‌ను రిలీజ్‌‌ కూడా చేసింది. రాష్ట్ర  బడ్జెట్‌‌లో ప్రగతి పద్దు కింద యూనివర్సిటీలకు నిధులు కేటాయించలేదు. దీంతో రూసా నిధులే ఆయా వర్సిటీలకు పెద్దదిక్కుగా మారాయి. అయితే కేంద్రం ఇచ్చే ఎస్ఎస్ఏ, రూసా నిధులకు రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్స్ సకాలంలో ఇవ్వడం లేదనే వాదనలున్నాయి. అయితే స్టేట్ఎస్ఎస్ఏకు మరిన్ని నిధులు ఇచ్చేందుకు పీఏబీలో ఆమోదం లభించింది. దీంతో మరిన్ని నిధులు వస్తాయని అధికారులు అంటున్నారు.  అయితే ఎస్ఎస్ఏ ద్వారా ఈ ఏడాది ఏపీ కంటే తెలంగాణకే ఎక్కువ నిధులు కేటాయించడం గమనార్హం.

ఐఐటీ, నిట్‌‌కూ ఎక్కువ నిధులు

ఐఐటీ హైదరాబాద్‌‌తోపాటు నిట్ (వరంగల్)​ కూ గతం కంటే కేంద్రం ఎక్కువ నిధులు ఇచ్చింది. 2018–19లో ఐఐటీహెచ్(ఈఏపీ)​కు రూ.11.25 కోట్ల నిధులిస్తే, ఈ ఏడాది రూ.80 కోట్లు రిలీజ్ చేసింది. గతేడాదితో పోలిస్తే రూ.68.75 కోట్లు ఎక్కువ. రాష్ట్రంలోని నేషనల్ ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ( నిట్)కు 2018–19లో రూ.189.21 కోట్లు రిలీజ్​చేస్తే, ఈ ఏడాది రూ.202.57 కోట్లు ఇచ్చింది. మిగిలిన సెంట్రల్ విద్యాసంస్థలకూ అధికంగానే నిధులు కేటాయించింది. అయితే ఈ ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి మరిన్ని నిధులు వచ్చే అవకాశముంది.