సాయం కోసం సర్కార్​కు .. 4 వేలకుపైగా వినతులు

సాయం కోసం సర్కార్​కు ..  4 వేలకుపైగా వినతులు
  • సాయం కోసం సర్కార్​కు ..  4 వేలకుపైగా వినతులు
  • రూ. 500 కోట్ల తక్షణ సాయంతో ఒక్కర్ని కూడా ఆదుకోలే!
  • ప్రభుత్వానికి, మంత్రులకు, హెల్ప్​లైన్​ సెంటర్​కు వరద బాధితుల మెయిల్స్, కాల్స్​

హైదరాబాద్​, వెలుగు: భారీ వర్షాలు, వరదల వల్ల తీవ్రంగా నష్టపోయని, ఆదుకోవాలంటూ రాష్ట్ర సర్కార్​కు పెద్ద ఎత్తున వినతులు వస్తున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు వచ్చి చూసిపోతున్నరే తప్ప తమకు ఎలాంటి ఆర్థిక సాయం చేయడం లేదని వరద బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాయం కోసం ప్రభుత్వానికి మెయిల్స్​ చేస్తున్నారు.  హెల్ప్ లైన్​ సెంటర్​కు ఫోన్లు చేస్తున్నారు. 

వాట్సాప్​లలో ఎమ్మెల్యేలకు, అధికారులకు మెసేజ్​లు పెడుతున్నారు. అటు నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో చివరికి గవర్నర్​కు కూడా మెయిల్స్​ పంపుతున్నారు. సాయం కోసం దాదాపు 4 వేలకు పైగా అప్లికేషన్లు వచ్చినట్లు ఆఫీసర్లు చెప్తున్నారు. ఇదిలా ఉంటే.. వరదలకు నష్టపోయినోళ్లకు రూ.500 కోట్లు తక్షణ సాయం కింద ఇస్తున్నట్లు  సెప్టెంబర్​ 30న ప్రభుత్వం ప్రకటించింది. అయితే వీటి నుంచి కొంత మొత్తమే రిలీజ్​ చేసినట్లు తెలిసింది. వాటి నుంచి కూడా రోడ్ల రిపేర్లు, ఇరిగేషన్​ కు సంబంధించి చెరువులు, వంతెనలకు, విద్యుత్​ స్తంభాలు ఇతరత్రా వాటికి ఖర్చుకే ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్లకు స్పష్టం చేసింది. 

వర్షాలు, వరదలకు చనిపోయిన వారికి ఎక్స్​గ్రేషియా ఇస్తామని చెప్పినా అదీ కూడా ఇవ్వలేదు. వరదల వల్ల రోడ్డున పడిన కుటుంబాలు వేల సంఖ్యలో ఉన్నాయి. ప్రభుత్వానికి అందిన ప్రాథమిక సమాచారం ప్రకారమే.. దాదాపు 40 వేల కుటుంబాలు ఇండ్లను వదిలి వెళ్లాయి. కానీ, ఎవరికి సాయం అందలేదు. కాగా.. ప్రిలిమినరీ అంచనాల ప్రకారం పంట నష్టం రూ.3 వేల కోట్లు దాటినట్లు ఆఫీసర్లు చెప్తున్నారు.