80 శాతానికి పైగా మున్సిపాలిటీలు గెలవబోతున్నం..బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటై ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశాయి

80 శాతానికి పైగా మున్సిపాలిటీలు గెలవబోతున్నం..బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటై ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశాయి
  •  బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

కరీంనగర్, వెలుగు: ప్రజల ఆశీర్వాదంతో 80 శాతానికి పైగా మున్సిపాలిటీలను గెలవబోతున్నామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటై ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశాయని ఆరోపించారు. ఎక్కడికక్కడ ఘర్షణ వాతావరణం క్రియేట్ చేస్తూ భౌతిక దాడులకు దిగి, పోలీసులను బద్నాం చేశారని మండిపడ్డారు.

కరీంనగర్ డీసీసీ ఆఫీస్​లో బుధవారం సాయంత్రం ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కరీంనగర్ నియోజకవర్గ ఇన్ చార్జి వెలిచాల రాజేందర్ రావు, లైబ్రరీ చైర్మన్ సత్తు మల్లేశం, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్,  సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ వైద్యుల అంజన్ కుమార్, అర్బన్ బ్యాంకు అధ్యక్షుడు కర్ర రాజశేఖర్ తో కలిసి మీడియాతో మాట్లాడారు.

నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఏకంగా పోలింగ్ బూత్ లోకి వెళ్లి భయభ్రాంతులకు గురిచేశారన్నారు. 12 ఏండ్లుగా మున్సిపాలిటీలకు ఏమీ చేయకుండా ఎన్నికల సమయంలో బీజేపీ ప్రజలను మభ్యపెట్టాలని చూసిందని విమర్శించారు.

మాజీ మంత్రి గంగుల కమలాకర్ పోలీస్ జీపు నుంచి కార్యకర్తను దౌర్జన్యంగా లాక్కెళ్లడమేంటని ప్రశ్నించారు. తల్లిని చంపి బిడ్డను బతికించారని తెలంగాణను అవమానించిన ప్రధాని మోదీకి రాష్ట్రంలో ఓట్లడిగే హక్కు లేదని పేర్కొన్నారు.